- మలివయసులో తల్లిదండ్రులకు చట్టబద్ధ భరోసా.
- అసెంబ్లీ ముందుకు కీలక బిల్లు
- కన్నవారిని కాదంటే జీతంలో కోత..
- ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం’ చట్టం సిద్ధం
- నిర్లక్ష్యం చేస్తే 15 శాతం వేతనం కట్.
- నేరుగా వృద్ధుల ఖాతాల్లోకే నగదు జమ
హైదరాబాద్,మహా.
కన్నతల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవడం కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు.. ఇకపై అది చట్టబద్ధమైన కర్తవ్యం కూడా. మలివయసులో ఆదరణ కరువై, సొంత పిల్లల నుంచే నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులకు కొండంత అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం ఉండి కూడా తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై కొరడా ఝుళిపిస్తూ, వారి వేతనం నుంచే భృతిని నేరుగా బాధితులకు అందజేసేలా రూపొందించిన “తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026″ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పుల వల్ల అనాథలవుతున్న వయోవృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేత చర్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ నూతన బిల్లు ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందితో పాటు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. తమ సంరక్షణ బాధ్యతను పిల్లలు విస్మరించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, విచారణ అనంతరం సదరు ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెలా 15 శాతం లేదా గరిష్ఠంగా రూ.10,000 వరకు (ఏది తక్కువైతే అది) నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా నిబంధనలు రూపొందించారు. ఇది కేవలం శిక్షగా మాత్రమే కాకుండా, ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను గుర్తుచేసే ప్రక్రియగా ప్రభుత్వం భావిస్తోంది. ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, నగరాలకు వలసలు పెరగడం వల్ల గ్రామాల్లోని వృద్ధులు ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో ఈ చట్టం వారికి ఒక భద్రతా కవచంలా నిలవనుంది.
దరఖాస్తు మరియు విచారణా ప్రక్రియను కూడా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేలా రూపకల్పన చేసింది. నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులు జిల్లా స్థాయిలో కలెక్టర్కు లేదా నిర్ణీత అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన 60 రోజుల్లోపు సంబంధిత ఉద్యోగిని, తల్లిదండ్రులను పిలిపించి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అధికారుల నిర్ణయంపై ఎవరికైనా అసంతృప్తి ఉన్నా లేదా నిర్ణీత గడువులోగా సమస్య పరిష్కారం కాకపోయినా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబోయే ‘వయోవృద్ధుల కమిషన్’ను ఆశ్రయించే వెసులుబాటు కల్పించారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కొనసాగే ఈ కమిషన్, అప్పీల్ అందిన 60 రోజుల్లోపు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల బాధితులకు న్యాయం చేకూరడంలో జాప్యం జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఈ చట్టంలో మానవీయ కోణానికి కూడా పెద్దపీట వేశారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించినా ఆ భృతి మొత్తం జీవించి ఉన్న మరొకరికి అందుతుంది. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే, సంబంధిత ఉద్యోగి ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోగా వేతన మినహాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తారు. కుటుంబ విలువలు కాలరాస్తూ, తల్లిదండ్రులను భారంగా భావించే నేటి సమాజంలో ఈ చట్టం ఒక నైతిక హెచ్చరికలా పని చేయనుంది. వ్యక్తిగత స్వేచ్ఛలో ప్రభుత్వ జోక్యం అంటూ కొందరు విమర్శించే అవకాశం ఉన్నప్పటికీ, ఒక రాష్ట్రంగా వృద్ధుల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక విధి అని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. కుటుంబ బంధాలను చట్టబద్ధంగా బలపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేసిన ఈ అడుగు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవనుంది.







