Mahaa Daily Exclusive

  మోదీ-ట్రంప్ ఫోన్ కాల్‌లో మస్క్ లేరు..! పుకార్లకు కేంద్రం చెక్..!

Share

  • మోదీ-ట్రంప్ ఫోన్ కాల్‌లో మస్క్ లేరు.
  • పుకార్లకు కేంద్రం చెక్!
  •  పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అగ్రనేతల సమాలోచన.

న్యూఢిల్లీ, మార్చి 28:

“ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియా యుద్ధ జ్వాలల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన అత్యంత కీలకమైన ఫోన్ సంభాషణపై నెలకొన్న ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఈ చర్చల్లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా భాగస్వాములయ్యారంటూ అంతర్జాతీయ మీడియాలో వెలువడిన కథనాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.” మార్చి 24న జరిగిన ఈ ఫోన్ కాల్‌లో కేవలం ఇద్దరు దేశాధినేతలు మాత్రమే పాల్గొన్నారని, మూడో వ్యక్తి ప్రస్తావన లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగిన ఈ ఏకాంత సంభాషణలో ప్రైవేట్ వ్యక్తులకు చోటు లేదని తెల్చిచెప్పడం ద్వారా గత కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు.

ఈ ఫోన్ సంభాషణ ప్రధానంగా ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ పరిస్థితుల చుట్టూ సాగింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టు వంటి ‘హర్మూజ్ జలసంధి’ భద్రతపై మోదీ తన ఆందోళనను ట్రంప్‌తో పంచుకున్నారు. ఇరాన్ నియంత్రణలో ఉన్న ఈ మార్గం ద్వారా అంతర్జాతీయ ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడితే, అది సామాన్య భారతీయుడి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వరకు తీవ్ర ప్రభావం చూపుతుందని మోదీ విశ్లేషించారు. యుద్ధం వల్ల నిత్యావసరాల ధరలు పెరగకుండా ఉండాలంటే సముద్ర మార్గాల భద్రత అత్యవసరమని, భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని ఆయన ఉద్ఘాటించారు. దీనికి స్పందనగా, అమెరికా కూడా శాంతి ప్రణాళికను సిద్ధం చేస్తోందని, త్వరలోనే ఇరాన్‌తో చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికా ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ ప్రకటనను బట్టి చూస్తే, ఈ వారంలోనే ఇరాన్ చర్చల మేజా వద్దకు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది.

Latest