Mahaa Daily Exclusive

  రహదారిపై మృత్యుఘోష..! హైదరాబాద్‌ శివారులోనే ‘ప్రమాద’ ఘంటికలు..!

Share

  •  జాతీయ స్థాయి 100 ప్రాంతాల జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు..
  • అగ్రస్థానంలో అబ్దుల్లాపుర్‌మెట్
  • సాయంత్రం వేళల్లోనే పొంచి ఉన్న గండం.
  •  అతివేగం, నిర్లక్ష్యానికి బలైపోతున్న ప్రాణాలు.

 

హైదరాబాద్‌ ,మహా.

 

నగర రణగొణ ధ్వనుల నుంచి ఉపశమనం పొందుతూ ఇంటికి చేరుకోవాల్సిన ప్రయాణం.. శివారు రహదారులకు వచ్చేసరికి ప్రాణ సంకటంగా మారుతోంది. భాగ్యనగరం చుట్టూ ఉన్న రహదారులు ఇప్పుడు రక్తసిక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని శివారు ప్రాంతాల్లో వాహనదారులు కళ్లు మూసి తెరిచేలోపే మృత్యువు కబళిస్తోంది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న అత్యంత ప్రమాదకరమైన 100 జిల్లాలు మరియు కమిషనరేట్లను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణకు చెందిన నాలుగు కీలక ప్రాంతాలు చోటు చేసుకోవడం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ జాబితాలో సైబరాబాద్‌ 44వ ర్యాంకులో ఉండగా, రాచకొండ 46, సంగారెడ్డి 56, వరంగల్ కమిషనరేట్ 60వ స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మూల ప్రమాదాలు జరుగుతున్నా, రాజధాని ముంగిట ఉన్న రంగారెడ్డి జిల్లా మాత్రం మృత్యుకుహరంగా మారుతుండటం గమనార్హం.

జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ 20 ప్రాంతాలతో అగ్రస్థానంలో, తమిళనాడు 19 ప్రాంతాలతో ద్వితీయ స్థానంలో ఉండగా.. తెలంగాణలో పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే ఏటా సుమారు 500 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2023 సంవత్సరంతో పోల్చితే 2024లో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరణాల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నా, గాయాల తీవ్రత మరియు క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుండటం విచారకరం. రంగారెడ్డి జిల్లాలో 2023లో 2,357 ప్రమాదాలు జరిగితే, 2024 నాటికి ఆ సంఖ్య 2,513కు చేరింది. అదే సమయంలో తీవ్రంగా గాయపడ్డ వారి సంఖ్య 633 నుంచి 804కు పెరగడం ప్రమాదాల తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం గణాంకాలు మాత్రమే కాదు, ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం వీధిన పడుతోంది.

ఈ మృత్యు క్రీడకు ప్రధానంగా సాయంత్రం వేళలే వేదికవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యే అత్యధిక ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆఫీసుల నుంచి ఇంటికి చేరుకోవాలనే ఆత్రుతలో వాహనదారుల అతివేగం, డ్రైవర్ల బాధ్యతారాహిత్యం, వీటికి తోడు రోడ్ల డిజైనింగ్‌లో ఉన్న సాంకేతిక లోపాలు వెరసి ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ తీవ్రతను గుర్తించిన రవాణా, పోలీసు మరియు రోడ్లు-భవనాల శాఖలు మార్చి 20న అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి రహదారుల వారీగా లోపాలను విశ్లేషించాయి. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ప్రమాదకర రహదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎన్‌హెచ్-44లో తెలంగాణ పరిధిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇక్కడ 2023లో 524 ప్రమాదాలు జరగ్గా, 2024లో 523 నమోదయ్యాయి. మరణాల సంఖ్య 295 నుంచి 263కు తగ్గినప్పటికీ, తీవ్ర గాయాల పాలైన వారు 125 మంది ఉండటం గమనార్హం.

రంగారెడ్డి జిల్లాలో పోలీస్ స్టేషన్ల వారీగా చూస్తే మృత్యువు చిరునామా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 42 పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ, కేవలం 15 స్టేషన్ల పరిధిలోనే 68.05 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో అబ్దుల్లాపుర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధి 73 మరణాలతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ‘మృత్యు కేంద్రం’గా మారింది. దీని తర్వాత ఆదిభట్ల 70 మరణాలతో రెండో స్థానంలో ఉండగా, యాచారం 60, పహాడీషరీఫ్ 58, హయత్ నగర్ 57 మరణాలతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉండే నార్సింగి (56), శంషాబాద్ (55), మహేశ్వరం (53), కొత్తూరు (48) ప్రాంతాల్లోనూ వాహనదారులు కాలి కింద వేగం ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. వనస్థలిపురం, కందుకూరు, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ వంటి రద్దీ ప్రాంతాల్లోనూ మరణాల సంఖ్య 30 నుంచి 45 మధ్య ఉండటం వాహనదారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, నిబంధనలను కఠినతరం చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి మానవ తప్పిదాలతో పాటు రహదారుల మలుపుల వద్ద సరైన సూచికలు లేకపోవడం, లైటింగ్ సమస్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా శంకర్ పల్లి (28), ఇబ్రహీంపట్నం (35) వంటి ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రమాదాలు శివారు రహదారుల అభివృద్ధిలో ఉన్న అస్తవ్యస్తతను చాటి చెబుతున్నాయి. రాజధాని చుట్టూ ఉన్న ఈ ‘డెత్ జోన్లను’ నిర్మూలించాలంటే కేవలం అధికారుల చర్యలు మాత్రమే సరిపోవు; వాహనదారులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. రహదారిపై వేగం కేవలం గమ్యాన్ని మాత్రమే కాదు, గమనాన్ని కూడా ముగిస్తుందని గుర్తించకపోతే ఈ రక్తం చిందించే కథనాలు ముగియవు.

 

**జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాంతాల ర్యాంకులు**

సైబరాబాద్ కమిషనరేట్: 44వ స్థానం

రాచకొండ కమిషనరేట్: 46వ స్థానం

సంగారెడ్డి జిల్లా: 56వ స్థానం

వరంగల్ కమిషనరేట్: 60వ స్థానం

రంగారెడ్డి జిల్లా గణాంకాలు (2023 vs 2024):

మొత్తం ప్రమాదాలు: 2,357 (2023) నుంచి 2,513 (2024)కు పెరిగాయి.

మరణాల సంఖ్య: 575 (2023) ఉండగా, 2024లో 527గా నమోదయ్యాయి.

తీవ్రంగా గాయపడ్డవారు: 633 (2023) నుంచి 804 (2024)కు భారీగా పెరిగారు.

జిల్లాలోని మొత్తం 42 పోలీస్ స్టేషన్లలో.. కేవలం 15 స్టేషన్ల పరిధిలోనే 68% మరణాలు సంభవిస్తున్నాయి.

అత్యధిక మరణాలు నమోదైన టాప్ 15 పోలీస్ స్టేషన్లు:

అబ్దుల్లాపూర్మెట్: 73 మరణాలు (ప్రథమ స్థానం)

ఆదిభట్ల: 70 మరణాలు

యాచారం: 60 మరణాలు

పహాడీషరీఫ్: 58 మరణాలు

హయత్ నగర్: 57 మరణాలు

నార్సింగి: 56 మరణాలు

శంషాబాద్: 55 మరణాలు

మహేశ్వరం: 53 మరణాలు

కొత్తూరు: 48 మరణాలు

వనస్థలిపురం: 44 మరణాలు

కందుకూరు: 40 మరణాలు

రాజేంద్రనగర్: 36 మరణాలు

ఎల్బీ నగర్: 36 మరణాలు

బ్రహీంపట్నం: 35 మరణాలు

శంకర్ పల్లి: 28 మరణాలు

**జాతీయ రహదారి (NH-44) – తెలంగాణ పరిధిలో**

మొత్తం ప్రమాదాలు: 524 (2023) | 523 (2024)

మరణాల సంఖ్య: 295 (2023) | 263 (2024)

తీవ్రంగా గాయపడ్డవారు: 95 (2023) | 125 (2024)

Latest