Mahaa Daily Exclusive

  అమరావతికి మళ్లీ ‘రాజ’యోగం..! అసెంబ్లీ సాక్షిగా పవన్‌కు చంద్రబాబు ‘భావోద్వేగ’ కృతజ్ఞతలు .!

Share

  • 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి.
  • అసెంబ్లీలో పక్కా టైమ్‌లైన్ ప్రకటించిన సీఎం.

అమరావతి , మహా:

“ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ప్రాభవాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభ శనివారం చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. ముఖ్యంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పవన్ కల్యాణ్ చూపిన తెగువ, అందించిన మద్దతును రాష్ట్రం ఎన్నటికీ మరవలేదని చంద్రబాబు కొనియాడారు. కూటమి ఏర్పాటు నుంచి చారిత్రక విజయం వరకు పవన్ పాత్రను వివరిస్తూ ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.”

 

**పవన్ అండ.. రాష్ట్రానికి కొండంత దమ్ము!**

 

2014 నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఆనాడు బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత తాను స్వయంగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించారని, ఆ మాటపై నేటికీ కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు తాను జైల్లో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో, విపక్షాలన్నీ ఏకమైతేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని పవన్ తీసుకున్న చొరవ అసాధారణమైనదని సీఎం అభివర్ణించారు. ఆ ఐక్యత వల్లే నేడు 175 స్థానాలకు గాను 164 సీట్లు గెలిచి, 94 శాతం స్ట్రైక్ రేట్‌తో ఒక రికార్డు విజయాన్ని నమోదు చేయగలిగామని స్పష్టం చేశారు.

 

**వైసీపీ ముక్కలాట.. అమరావతికి ద్రోహం!**

 

గత వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మూడు రాజధానుల’ పేరుతో వైసీపీ ఆడిన ‘మూడు ముక్కలాట’ రాష్ట్ర అభివృద్ధిని పదేళ్లు వెనక్కి నెట్టిందని మండిపడ్డారు. అమరావతిని శివసేన, బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు అందరూ ఆమోదించినప్పటికీ, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే రాజధానిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఒక నగరం పనులు ఆగిపోయి, మళ్లీ ప్రారంభం కావడం ప్రపంచ చరిత్రలో అమరావతిలోనే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో అమరావతి రైతులు పడిన బాధలకు ప్రజలే తమ ఓటుతో తగిన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

 

**2028 నాటికి నవ నగరం సిద్ధం!**

 

అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి స్పష్టమైన గడువులను ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 15,000 కోట్లు మంజూరు చేసిందని, మే 2, 2025 నుంచి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మంత్రి నారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ట్రంక్ రోడ్లు, అసెంబ్లీ, హైకోర్టు మరియు ఐకానిక్ టవర్ల పూర్తికి సంబంధించిన స్పష్టమైన కాలక్రమ పట్టికను సభ ముందు ఉంచారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణీత సమయంలోనే రాజధానిని పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు ఘంటాపథంగా చెప్పారు.

Latest