Mahaa Daily Exclusive

  ‘నేషన్ ఫస్ట్’ మన సిద్ధాంతం..! తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్’ సర్కారే లక్ష్యం..

Share

  • తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్’ సర్కారే లక్ష్యం.
  •  భారత్‌లో మాత్రం మోదీ సాహసోపేత నిర్ణయం!
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు కేడర్‌కు దిశానిర్దేశం.

మహబూబ్‌నగర్, మహా.

“భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ పక్షం కాదు.. అదొక పవిత్రమైన సిద్ధాంతం, దేశ సేవకు అంకితమైన కార్యకర్తల సైన్యం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిన మన పార్టీకి క్రమశిక్షణే వెన్నెముక” అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఉద్ఘాటించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌-2026’ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీలో కార్యకర్తల నిర్మాణానికి, సిద్ధాంత అవగాహనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, రేపటి నాయకులను తయారు చేయడమే ఈ శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

 

**పెట్రో ధరలపై ప్రపంచానికి, భారత్‌కు తేడా ఇదే!**

 

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాంచందర్ రావు సోదాహరణంగా వివరించారు. “పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో లండన్‌లో పెట్రోల్ ధరలు 13 శాతం, అమెరికాలో 34 శాతం, ఆస్ట్రేలియాలో 18 శాతం వరకు పెరిగాయి. పాకిస్థాన్, నైజీరియా వంటి దేశాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కానీ, భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుడిపై భారం పడకూడదనే సంకల్పంతో ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా రూ.10 తగ్గించారు” అని ఆయన వెల్లడించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ‘ఆయిల్ బాండ్ల’ పేరుతో లక్షల కోట్ల భారాన్ని భవిష్యత్తు తరాలపై మోపిందని, ఆ పాపాలను కూడా నేడు మోదీ ప్రభుత్వమే భరిస్తూ ప్రజలకు ఊరటనిస్తోందని విమర్శించారు.

 

**వదంతులు నమ్మొద్దు.. సోషల్ మీడియాలో పోరాడండి**

 

రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారంపై రాంచందర్ రావు నిప్పులు చెరిగారు. దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత ఉందంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. “మన కార్యకర్తలు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్, ఉచిత బియ్యం వంటి పథకాలను ఇంటింటికీ చేరవేయాలి. పార్టీపై వచ్చే ప్రతి అబద్ధపు వార్తను గట్టిగా ఖండించాలి” అని కేడర్‌కు పిలుపునిచ్చారు.

 

**తెలంగాణలో మార్పు ఖాయం**

 

తెలంగాణలో ఇప్పటివరకు వివిధ పార్టీలకు అవకాశమిచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ ఎదుగుదలను ఆపలేవని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి వేగవంతం కావాలంటే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక ఎజెండాగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. వాజపేయి చూపిన బాటలో, మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతోందని, అందులో తెలంగాణ భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.

Latest