Mahaa Daily Exclusive

  పెట్రో ‘మంట’ల వెనుక అంతర్జాతీయ కుట్ర..! మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన విశ్లేషణ.. 

Share

  •  వదంతులు నమ్మొద్దు.. బంకుల్లో ఇంధనం పుష్కలం.. ఆందోళన వద్దు!
  • యుద్ధం ముగిసే వరకు సంయమనం పాటించాలి.. ఉజ్వల తో మారిన వంటింటి ముఖచిత్రం!
  •  మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన విశ్లేషణ.

 

హైదరాబాద్, మహా.

 

“తెలంగాణలో గత వారం రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న కిలోమీటర్ల మేర క్యూలు, ప్రజల్లో నెలకొన్న భయాందోళనల వెనుక వాస్తవాల కంటే వదంతులే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీస్తున్న మాట వాస్తవమే అయినా, దేశంలో ఇంధన కొరత ఉందన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రస్తుత గ్లోబల్ సంక్షోభం మరియు భారత ప్రభుత్వ వ్యూహాలను కళ్లకు కట్టారు.”

 

**అంతర్జాతీయ కుంపటి.. వంటింట్లో సెగ**

 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం పెట్రోలియం ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోందని కిషన్ రెడ్డి విశ్లేషించారు. మనం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్న తరుణంలో, గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరిగినా, సరఫరాలో ఆటంకాలు ఎదురైనా సామాన్య భారతీయుడిపై ఆ భారం పడకుండా మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని చెప్పారు. “ఎంత ధర చెల్లించైనా సరే, దేశానికి అవసరమైన చమురును తీసుకురావడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదు. ప్రతిరోజూ విదేశీ నాయకులతో చర్చలు జరుపుతూ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూస్తున్నాం” అని ఆయన భరోసా ఇచ్చారు.

 

**వదంతులే పెద్ద శత్రువు.. సోషల్ మీడియాపై హెచ్చరిక**

 

పెట్రోల్ పంపుల వద్ద రద్దీకి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారమే ప్రధాన కారణమని మంత్రి మండిపడ్డారు. “కొరత ఉందనే చిన్న పుకారు ప్రజలను బంకుల వైపు పరుగులు తీయిస్తోంది. దీనివల్ల అనవసరమైన కృత్రిమ కొరత ఏర్పడుతోంది. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే స్పష్టం చేశాయి.. మన దగ్గర నిల్వలు నిండుగా ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెంది ట్యాంకులు ఫుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

**మారుతున్న ఇంధన సంస్కృతి.. ‘ఉజ్వల’ విప్లవం**

 

దేశంలో ఇంధన వినియోగం పెరగడం అభివృద్ధికి సూచిక అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కట్టెలు, కిరోసిన్ వాడిన నిరుపేదలు నేడు ‘ఉజ్వల’ పథకం ద్వారా ఎల్పీజీ సిలిండర్లు వాడుతుండటం ఆరోగ్యకరమైన మార్పు అని కొనియాడారు. అయితే, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలను భారీగా ప్రోత్సహిస్తోందని చెప్పారు. రైల్వేల విద్యుదీకరణ కూడా చమురు దిగుమతులపై భారాన్ని తగ్గించడానికేనని ఆయన వివరించారు.

Latest