తెలంగాణలో రాజకీయ మార్పు ఖాయం…
*అభివృద్ధి నిలిచిపోయింది.. రేవంత్ సర్కార్ది ద్వంద్వ వైఖరి.
* యువత, మహిళల ఆశ కిరణం బీజేపీ.
* జీహెచ్ఎంసీ సమరానికి సిద్ధం కావాలి.
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోందని, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీయే ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం దిల్సుఖ్నగర్లో నిర్వహించిన భారీ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు, యువత, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి రాంచందర్ రావు సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఒక పెద్ద రాజకీయ మార్పునకు ఈ చేరికలే స్పష్టమైన సంకేతాలని అభివర్ణించారు. నిత్యం రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న చేరికలను బట్టి చూస్తుంటే ప్రజలు మార్పును ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కానీ, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కానీ హైదరాబాద్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన విమర్శించారు. గతంలో అటల్ బిహారీ వాజపేయి హయాంలో రూపొందించిన ప్రణాళికల వల్లే హైదరాబాద్ కొంతమేర అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం నగరంలో కనిపిస్తున్న కొద్దిపాటి ప్రగతి కూడా బీజేపీ కార్పొరేటర్లు చురుకుగా పనిచేస్తున్న ప్రాంతాల్లోనే సాధ్యమైందని స్పష్టం చేశారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ రహదారుల నిర్మాణం హైదరాబాద్ పరిసరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని రాంచందర్ రావు వివరించారు. మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాల ద్వారా రక్షణ, సెల్ఫోన్ తయారీ రంగాలకు చెందిన పరిశ్రమలు నగర శివార్లలో కొలువుదీరుతున్నాయని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని గుర్తు చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఒకవైపు దేవాలయాల నిర్మాణం గురించి మాట్లాడుతూనే, మరోవైపు హిందూ దేవతలను అవమానించేలా వ్యవహరించడం రేవంత్ రెడ్డి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు.
అయోధ్య రామమందిరం కోట్లాది భక్తుల విరాళాలతో నిర్మితమైందని, కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల రాజకీయం కోసం ఆలయాలు, మసీదుల పేరుతో నాటకాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందక విద్యార్థులు, ఆరోగ్యశ్రీ నిధులు లేక సామాన్య ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం ఆ సమస్యలను గాలికొదిలేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, భారత్లో మోదీ దార్శనికత వల్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలను రక్షించగలుగుతున్నామని పేర్కొన్నారు.
2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదగడం ఖాయమని, ఈ ప్రయాణంలో తెలంగాణ యువత, మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం మేధావులు, యువత నడుం బిగించాలని కోరారు. అలాగే ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి కార్యకర్త తమ ఇంటిపై గర్వంగా జెండా ఎగురవేసి పార్టీ సిద్ధాంతాలను చాటిచెప్పాలని రాంచందర్ రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.








