Mahaa Daily Exclusive

  అసెంబ్లీలో సస్పెన్షన్ల వేటు: కేటీఆర్, హరీశ్‌రావు సహా 24 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై బహిష్కరణ!

Share

అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం..
* కేటీఆర్‌, హరీశ్‌ సహా 24 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటు.
* మైనింగ్‌ సెగతో అట్టుడికిన శాసనసభ.
* బడ్జెట్‌ సమావేశాల ముగిసే వరకు విపక్ష నేతల బహిష్కరణ.
* పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే.. బీఆర్‌ఎస్‌ పట్టు..
* కేసీఆర్‌, హరీశ్‌ను జైల్లో పెట్టాకే మాట్లాడండి..రేవంత్‌ కౌంటర్.
హైదరాబాద్‌, మహా.

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆదివారం రణరంగంగా మారాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారం సభను కుదిపేసింది. ఈ అంశంపై విచారణకు సభా సంఘం వేయాలని, మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడమే కాకుండా, సభా కార్యక్రమాలకు పదేపదే అడ్డుతగులుతున్నారన్న కారణంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా 24 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు (రెండు రోజుల పాటు) సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

**గన్‌పార్క్‌ నుంచి సభ వరకు.. నిరసన జ్వాలలు**

ఉదయం సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి భారీ నిరసన చేపట్టారు. “మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి”, “అక్రమ మైనింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం అదే ప్లకార్డులతో సభలోకి ప్రవేశించిన సభ్యులు, ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. దీనిని స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లారు. మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

**నిప్పులు చెరిగిన రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ను జైల్లో పెట్టాకే మాట్లాడండి**

సభలో బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తుతూనే, బీజేపీ తీరును కూడా తప్పుబట్టారు. “కేసీఆర్, హరీశ్‌రావులను జైల్లో పెట్టిన తర్వాతే బీజేపీ నేతలు నీతులు మాట్లాడాలి” అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందని, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

**కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆగ్రహం.. సీబీసీఐడీ విచారణకు ఆదేశం**

ఇదే సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, సీనియర్ నేత కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు సభలో మంటలు రేపాయి. కౌశిక్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. మరోవైపు, మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రి సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ నేతల వద్ద ఏవైనా పక్కా ఆధారాలు ఉంటే అధికారులకు సమర్పించాలని, దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేకుండా సభను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.

** సస్పెన్షన్‌ అనంతరం హైడ్రామా.. కేసీఆర్‌ ఛాంబర్‌ వద్ద ఉత్కంఠ**

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఆమోదించడంతో 24 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి వంటి కీలక నేతలందరినీ మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు. అయితే, అసెంబ్లీలోని కేసీఆర్ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకోవడంతో మరోసారి హైడ్రామా నడిచింది. తమ సొంత ఛాంబర్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో భేటీ అయిన నేతలు.. తమ పోరాటం అసెంబ్లీకే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అవసరమైతే గవర్నర్‌ను కలిసి మంత్రి పొంగులేటి అవినీతి చిట్టాను సమర్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

**సస్పెండైన ప్రధాన నేతలు వీరే**

కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీశ్‌ రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పద్మారావు గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితర 24 మంది సభ్యులు.

Latest