- డ్రైవర్ కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన దళపతి
- వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న తండ్రీకొడుకులు
- విశ్వసనీయతకు దక్కినగౌరవం
- రెండు చోట్ల పోటీ చేస్తున్న విజయ్
చెన్నై, మహా : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు దళపతి విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తన వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంలనంగా మారింది. తన సొంత డ్రైవర్, ప్రస్తుతం తన పీఏగా వ్యవహరిస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విరుగాంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు దళపతి విజయ్. అభ్యర్థుల ప్రకటన సమయంలో శబరినాథన్ పేరు వినబడగానే తండ్రీకొడుకులు ఇద్దరూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. శబరినాథన్ స్టేజీపైనే విజయ్ కాళ్లకు నమస్కరించి, ఆయనను హత్తుకుని వెక్కివెక్కి ఏడ్చారు. తన కోసం మూడు దశాబ్దాలుగా కష్టపడుతున్న వ్యక్తి కుమారుడు అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి విజయ్ చలించిపోయారు. స్వయంగా తన చేతులతో శబరినాథన్ కన్నీళ్లు తుడిచి అతడిని ఓదార్చారు. ఈ దృశ్యం చూసిన రాజేంద్రన్ కూడా ఆనందబాష్పాలు ఆపుకోలేకపోయారు.
విశ్వసనీయతకు దక్కిన గౌరవం
విజయ్ మొదటి సినిమా నుంచి రాజేంద్రన్ ఆయన వద్దే పని చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు డ్రైవర్‌గా సేవలందించిన రాజేంద్రన్‌ను విజయ్ తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు. శబరినాథన్ కూడా విరుగాంబాక్కం నియోజకవర్గంలో పార్టీ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. “విశ్వసనీయతకు పట్టం కట్టడం అంటే ఇదే.. తన డ్రైవర్ కొడుకును రాజకీయ నాయకుడిని చేసిన విజయ్ గొప్ప మనసు గలవాడు” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ
మరోవైపు విజయ్ స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. “నేను పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు సి. జోసెఫ్ విజయ్ అని నామినేషన్ వేస్తాను” అని విజయ్ పేర్కొన్నారు. ప్రజలతో కలిసి నిలబడే వారినే తాను అభ్యర్థులుగా ఎంపిక చేశానని ఆయన స్పష్టం చేశారు.








