ఢిల్లీ, మహా.
వంటగ్యాస్ కొరతతో ఆందోళన చెందుతున్న భారత్‌కు భారీ ఊరట లభించింది. భీకర దాడులతో అట్టుడుకుతున్న హార్ముజ్ జలసంధి నుంచి భారత జెండాతో ఉన్న మరో రెండు ఎల్‌పీజీ కార్గో నౌకలు సురక్షితంగా బయటపడ్డాయి. సుమారు 94 వేల టన్నుల ఎల్‌పీజీతో వస్తున్న ‘బీడబ్ల్యూ టైర్’ , ‘బీడబ్ల్యూ ఈఎల్‌ఎం’అనే రెండు నౌకలు రాబోయే రెండు మూడు రోజుల్లో భారత తీరానికి చేరుకోనున్నాయి. దేశం మొత్తానికి ఒక రోజుకు సరిపడా వంటగ్యాస్‌ను ఈ రెండు నౌకలే మోసుకొస్తుండటం గమనార్హం. వీటిలో ‘బీడబ్ల్యూ టైర్’ మార్చి 31 నాటికి ముంబయికి చేరుకోనుండగా, ‘బీడబ్ల్యూ ఈఎల్‌ఎం’ ఏప్రిల్ 1న మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ రెండు నౌకల కంటే ముందే దాదాపు 92 వేల టన్నుల వంటగ్యాస్‌తో బయలుదేరిన ‘జగ్ వసంత్’, ‘పైన్ గ్యాస్’ నౌకలు ఇప్పటికే భారత జలాల్లోకి ప్రవేశించాయి. 47 వేల టన్నుల ఎల్‌పీజీతో ఉన్న జగ్ వసంత్ శుక్రవారం రాత్రికే గుజరాత్‌లోని వాదినార్ ఓడరేవుకు చేరుకోగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన పైన్ గ్యాస్ నౌక ఏప్రిల్ 2న ఒడిశాలోని ధమ్రా పోర్టుకు చేరుకోనుంది. ఇరాన్ ఆమోదించిన ప్రత్యేక మార్గాల ద్వారా ఈ నౌకలు హర్మూజ్ జలసంధిని దాటడం విశేషం. వీటితో పాటు మార్చి మూడో వారంలో ఎంటీ శివాలిక్, ఎంటీ నందా దేవి వంటి నౌకలు కూడా సురక్షితంగా ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకున్నాయి. యుద్ధం మొదలయ్యే నాటికి గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 28 భారతీయ నౌకల్లో మెజారిటీ నౌకలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకోగా, ఇంకా 18 నౌకలు 485 మంది భారతీయ నావికులతో అక్కడే ఉన్నట్లు సమాచారం.
భారత్ తన వార్షిక ఎల్‌పీజీ అవసరాల్లో 60 శాతాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ఇందులో 90 శాతం ఒక్క పశ్చిమాసియా నుంచే వస్తుండటంతో ప్రభుత్వం ఈ సరఫరా గొలుసుపై ప్రత్యేక దృష్టి సారించింది. గల్ఫ్‌లో చిక్కుకున్న నావికుల భద్రత కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సత్వర చర్యల వల్ల 942 మంది భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతీయ నౌకలు సురక్షితంగా బయటపడటం భారత్-ఇరాన్ మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాలకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, ఇంధన సరఫరాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలతో ముందస్తు కొనుగోళ్లు చేయవద్దని కోరింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగినప్పటికీ, సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోటు లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.








