Mahaa Daily Exclusive

  కార్యకర్తలను కాదని ఎవరూ ఎదగలేరు..! తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

Share

  • కార్యకర్తలను కాదని ఎవరూ ఎదగలేరు.
  • కార్యకర్తల సంక్షేమ బాధ్యత లోకేశ్‌కే.
  • అమరావతి పనులు 2028 కల్లా పూర్తి.
  •  తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

మంగళగిరి,మహా.

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన పునాది అని, వారిని నిర్లక్ష్యం చేసే నాయకులను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా హెచ్చరించారు. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే కార్యకర్తలను దూరం పెట్టే నేతలకు పార్టీలో స్థానం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నిజం చేస్తూ, వేదికపై సామాన్య కార్యకర్తలను ఆసీనులను చేసి, తాను స్వయంగా సభికుల్లో కూర్చుని సరికొత్త రాజకీయ సంప్రదాయానికి తెరలేపారు.

భవిష్యత్తులో పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే వారికే పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరగనున్నాయని, అలాగే 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని గుర్తు చేస్తూ, సాధారణ కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశం ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి, వారి సంక్షేమాన్ని పర్యవేక్షించే కీలక బాధ్యతను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ఈ వేదికగా ప్రకటించారు. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనతో పార్టీ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని ఆయన హితవు పలికారు.

టీడీపీ ప్రస్థానంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు గుర్తుచేశారు. నాడు రూ.2 కే కిలో బియ్యం పథకం నుంచి నేటి సామాజిక పెన్షన్ల వరకు ప్రతి అడుగు ప్రజాక్షేమం కోసమేనని అన్నారు. పార్టీని అంతం చేస్తామన్న వారే కాలగర్భంలో కలిసిపోయారని, అలిపిరి దాడి నుంచి అక్రమ అరెస్టుల వరకు తాము ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు పడిన ఇబ్బందులను, లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎదురైన అడ్డంకులను ప్రస్తావిస్తూ.. వాటన్నింటినీ తట్టుకుని నిలబడబట్టే ఈరోజు మళ్లీ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని కొనియాడారు. కార్యకర్తల త్యాగాల పునాదులపైనే నేటి అధికారం నిలబడి ఉందని ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

ప్రస్తుత ప్రభుత్వ పాలనపై స్పందిస్తూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.4,000 సామాజిక పెన్షన్ అందిస్తున్నామని, తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలతో ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు. నిరుద్యోగుల కోసం డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌తో పాటు 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గుర్తు చేశారు. పరిశ్రమలను రప్పించి 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో కూడా భారం వేయబోమని స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజధాని అంశంపై చంద్రబాబు మరోసారి తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. ఇకపై మూడు ముక్కలాట ఉండదని, ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అదే అమరావతి అని పునరుద్ఘాటించారు. అమరావతి నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా రికార్డు సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. చివరగా, కార్యకర్తలంతా ప్రజల్లో ఉంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా 19 మంది కార్యకర్తలను గౌరవించి, అండమాన్ నికోబార్ సహా ఇతర ప్రాంతాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

Latest