* వట్టినాగులపల్లి ‘ఖబరస్థాన్’.
* ₹1400 కోట్ల భూమి కోసం బాధితులపై పొంగులేటి కుమారుడి ‘సజీవ దహనం’ హెచ్చరిక!
*అర్ధరాత్రి జేసీబీల మారణహోమం.. నంబర్ ప్లేట్లు లేని వాహనాలతో మంత్రి కుటుంబం ‘రాక్షస’ క్రీడ: నిప్పులు చెరిగిన కేటీఆర్!
* పేగు బంధంపై ‘పొంగులేటి’ పంజా.. బాధితులను రాత్రంతా నిలబెట్టి నరకయాతన.. రేవంత్ సర్కార్‌లో భూ కబ్జాల పర్వం!
* రేవంత్-పొంగులేటి ‘వ్యాపార’ బంధంతోనే భూ కబ్జాలు.. మంత్రిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ వద్దకు బీఆర్‌ఎస్!
హైదరాబాద్, మహా.
భాగ్యనగర పొలిమేరల్లోని వట్టినాగులపల్లి గ్రామం ఇప్పుడు అధికార పక్ష అరాచకాలకు వేదికగా మారింది. ఆరు దశాబ్దాల క్రితం నుంచి సాగు చేసుకుంటున్న భూమిపై మంత్రి కన్ను పడితే.. ఆ పేద కుటుంబం బతుకు రాత్రికి రాత్రే చిందరవందర అయిపోయింది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి అండతో ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ గుండాలు సాగించిన విధ్వంసంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోమవారం నిప్పులు చెరిగారు. బాధితులు సతీష్ షా కుటుంబ సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్, జరిగిన దురాగతాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు.
**ఆరు దశాబ్దాల చరిత్ర.. అమాంతం పెరిగిన ఆశలు**
వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబానికి 1960 నుంచి భూమి ఉంది. గడిచిన 60 ఏళ్లుగా ఆ భూమిలో వారు వ్యవసాయం చేసుకుంటూ, నివాసం ఉంటున్నారు. కాలక్రమేణా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం, భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో ఆ 27 ఎకరాల భూమి విలువ ఇప్పుడు దాదాపు ₹1400 కోట్లకు చేరింది. ఈ భారీ మొత్తంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్ను పడిందని, తన కుమారుడు హర్షా రెడ్డితో కలిసి ఆ భూమిని దక్కించుకోవడానికి వారు బరితెగించారని కేటీఆర్ ఆరోపించారు. “నేరుగా సతీష్ షా ఇంటికే వెళ్లి, భూమిని తమకు డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని, లేనిపక్షంలో మీ బతుకులు బుగ్గిపాలవుతాయని బెదిరించడం ఏ తరహా రాజకీయం?” అని ఆయన నిలదీశారు.
**అర్ధరాత్రి వేళ.. నంబర్ ప్లేట్లు లేని జేసీబీల బీభత్సం**
మంత్రి బెదిరింపులకు బాధితులు లొంగకపోవడంతో, అరాచకం మరుసటి స్థాయికి చేరింది. అర్ధరాత్రి వేళ, నిశ్శబ్దంగా ఉన్న వట్టినాగులపల్లిలో ఒక్కసారిగా జేసీబీల గర్జన మొదలైంది. నంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో వచ్చిన ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ గుండాలు, బాధితులు ప్రాణప్రదంగా పెంచుకుంటున్న గోశాలను నిమిషాల్లోనే నేలమట్టం చేశారు. కిలోమీటరు మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేస్తూ లోపలికి చొచ్చుకొచ్చారు. అడ్డుకోవడానికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారు. “ఎక్కువ మాట్లాడితే ఇక్కడే గోతులు తీసి సజీవంగా పాతిపెడతాం” అంటూ హర్షా రెడ్డి అనుచరులు తుపాకులతో బెదిరించి, ఆ చలి రాత్రంతా వారిని నిలబెట్టి హింసించారని కేటీఆర్ వివరించారు. ఆ దృశ్యాలను వివరిస్తున్నప్పుడు బాధితులు కన్నీటి పర్యంతం కావడం అక్కడి వారిని కలచివేసింది.
**వ్యవస్థల మేనేజ్‌మెంట్.. నిజాయితీ అధికారిపై వేటు**
ఈ అరాచకానికి రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలను పావులుగా వాడుకున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ₹100 కోట్ల లంచం కేసులో ఏసీబీకి చిక్కిన ఒక ఉన్నతాధికారి ద్వారా దొంగ సర్వేలు చేయించి, ఆ భూమిని నిషిద్ధ జాబితాలోకి చేరుస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఇంతటి దారుణం జరుగుతుంటే, బాధితుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను ప్రభుత్వం వెంటనే బదిలీ చేసిందని విమర్శించారు. “రాష్ట్రపతి పతకం అందుకున్న అధికారికి ఇచ్చే బహుమతి ఇదేనా? మంత్రి కోసం చట్టాన్ని తుంగలో తొక్కుతారా?” అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
**ముఖ్యమంత్రి అండ.. ధరణి పేరుతో దోపిడీ**
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార బంధమే ఈ భూ కబ్జాలకు ఊపిరి పోస్తోందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో 20 లక్షల ఎకరాల భూమి నిషిద్ధ జాబితాలో ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోటి ఎకరాలకు పెంచిందని, ప్రజలను భయపెట్టి అందులో 50 శాతం వాటా డిమాండ్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రిపై చర్యలు తీసుకోకపోగా, ప్రశ్నించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడులకు తెగబడటం హేయమని మండిపడ్డారు.
**గవర్నర్‌కు ఫిర్యాదు.. బాధితులకు ‘తెలంగాణ భవన్’ భరోసా**
తక్షణమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ భూ కబ్జా ఉదంతంపై ఆధారాలతో సహా రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. “రాష్ట్రంలో భూ కబ్జాలకు, బెదిరింపులకు గురవుతున్న బాధితులందరికీ తెలంగాణ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి. మా వద్దకు రండి.. మీకు న్యాయపరంగా, రాజకీయంగా అండగా ఉంటాం” అని ఆయన భరోసా ఇచ్చారు. పొంగులేటి కుటుంబం చేసిన మరిన్ని కుంభకోణాలను త్వరలోనే వీధిలో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








