Mahaa Daily Exclusive

  నగరంలో అక్రమ నిర్మాణాల జాతర..! అధికారుల అండ.. బిల్డర్ల దందాపై హైకోర్టు ఆగ్రహం..!

Share

  •  నగరంలో అక్రమ నిర్మాణాల జాతర.
  •   అధికారుల అండ.. బిల్డర్ల దందాపై హైకోర్టు ఆగ్రహం!
  •   కోట్లలో జరిమానాలున్నా ఆగని అక్రమ కట్టడాల పర్వం!
  •   పర్యవేక్షణ నిల్.. ప్రజాధనం వృథా ఫుల్.. సామాన్యుడికి తప్పని తిప్పలు!

 

హైదరాబాద్, మహా.

 

సిమెంట్ అడవిలా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు ఇప్పుడు ఒక మహమ్మారిలా విస్తరిస్తున్నాయి. కేవలం భాగ్యనగరమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లో నిబంధనల ఉల్లంఘన వికృత రూపాన్ని సంతరించుకుంది. గడిచిన ఐదేళ్లలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఏకంగా రెండున్నర లక్షల రిట్ పిటిషన్లు దాఖలయ్యాయంటే పరిస్థితి ఎంతటి జఠిలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఏడాదిలో జీహెచ్ఎంసీ అధికారులు సుమారు 15 వందల అక్రమ కట్టడాలను గుర్తించి, వెయ్యికి పైగా కూల్చివేతలు చేపట్టినప్పటికీ, అక్రమార్కుల జోరు మాత్రం తగ్గడం లేదు. అనుమతుల ప్రక్రియలో అధికారుల అలసత్వం, వ్యవస్థలో అడుగడుగునా పేరుకుపోయిన అవినీతి, చిన్న ప్లాట్లలో భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలనే బిల్డర్ల అత్యాశ వెరసి నగరాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి.

నగర జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్న ఈ అక్రమ కట్టడాల ప్రభావం సామాన్యుడిపై తీవ్రంగా పడుతోంది. జీహెచ్ఎంసీ ‘ప్రజావాణి’కి వస్తున్న ఫిర్యాదుల్లో సగానికి పైగా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించినవే ఉండటం గమనార్హం. నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్న ఈ భవనాల వల్ల నగరంలో నీటి కొరత, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. అధికారులు పైకి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, జరిమానాల నిబంధనలే ఉల్లంఘనదారులకు వరంగా మారుతున్నాయి. ఉల్లంఘన 10 శాతం లోపు ఉంటే కేవలం 25 శాతం పన్ను జరిమానా, అంతకు మించితే 50 నుంచి 100 శాతం వరకు పెనాల్టీ కడితే సరిపోతుందన్న వెసులుబాటు ఉండటంతో, బిల్డర్లు ఆ జరిమానాను ‘లైసెన్స్ ఫీజు’గా భావించి యథేచ్ఛగా అక్రమాలను కొనసాగిస్తున్నారు.

ఈ అక్రమ సామ్రాజ్యం వెనుక అధికారులు, స్థానిక నేతలు మరియు బిల్డర్ల మధ్య ఒక బలమైన ‘అవినీతి కూటమి’ ఉందని రాష్ట్ర హైకోర్టు నేరుగా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. పునాదుల దశలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు, భవనం పూర్తయ్యాక నోటీసులు ఇస్తున్నారని, వారు కళ్లు మూసుకుని ఉన్నారా లేక ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారా అని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలోనే 2025-26 కాలంలో ఏసీబీ జరిపిన మెరుపు దాడులు అధికారుల అసలు రంగును బయటపెట్టాయి. కూకట్‌పల్లి జోన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ చిన్నా రెడ్డి 15 లక్షల లంచం తీసుకుంటూ 2026 ఫిబ్రవరిలో చిక్కడం వ్యవస్థలోని కుళ్లును బహిర్గతం చేసింది. వీరితో పాటు కాప్రా, గోల్నాక, సికింద్రాబాద్ పరిధిలోని ఏఈఈలు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ పట్టుబడటం, లంచాల ఆరోపణలతో 27 మంది తాత్కాలిక ఇంజినీర్లను తొలగించడం సంచలనంగా మారింది.

గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ వంటి క్రమబద్ధీకరణ పథకాలు అక్రమార్కులకు కొండంత అండగా నిలిచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జరిమానాలు కడితే చాలు అనే ధీమాతో ఉల్లంఘనలకు హద్దుల్లేకుండా పోయాయి. అయితే ఈ వ్యవస్థాగత వైఫల్యాలకు బలవుతున్నది మాత్రం సగటు మధ్యతరగతి జీవే. కష్టపడి సంపాదించిన సొమ్ముతో అనుమతులు లేని ఫ్లాట్లు కొనుగోలు చేసి, నేడు బ్యాంకుల నుంచి రుణాలు రాక, ఎప్పుడు కూల్చివేస్తారో అన్న భయంతో వేలాది కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు బీఎన్ఎస్ సెక్షన్ 223 కింద క్రిమినల్ కేసులు, 400 శాతం పెనాల్టీలు, ఈసీలో నమోదు వంటి కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవినీతి కూటమిని తుదముట్టిస్తే తప్ప ఈ అక్రమ నిర్మాణాల పర్వానికి ముగింపు పడేలా కనిపించడం లేదు.

Latest