Mahaa Daily Exclusive

  పొంగులేటి మైనింగ్ అక్రమాలపై గవర్నర్‌కు ‘గులాబీ’ బృందం ఫిర్యాదు..!

Share

  •  పొంగులేటి మైనింగ్ అక్రమాలపై గవర్నర్‌కు ‘గులాబీ’ బృందం ఫిర్యాదు.
  •   హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి!
  •  రాష్ట్రంలో అరాచక పాలన.. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్న కాంగ్రెస్.
  •  రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్… సభా సంఘం వేయాలి.
  •   రక్షకులే భక్షకులయితే సామాన్యుడి గతేంటి?
  •   లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం దాదాపు గంటకు పైగా భేటీ.

 

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాన్యుడి ఆస్తులకు రక్షణ కరువైందని, ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు నిప్పులు చెరిగారు. సోమవారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం దాదాపు గంటకు పైగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ చేపడుతున్న అక్రమ మైనింగ్, భూకబ్జాలకు సంబంధించిన సమగ్ర సాక్ష్యాధారాలను, పత్రాలను గవర్నర్‌కు అందజేశారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పొంగులేటిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు. ఈ మొత్తం ఉదంతంపై ఒక స్వతంత్ర జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేనిపక్షంలో బాధితులకు న్యాయం జరగదని విన్నవించారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు 1975 నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో ప్రస్తుత గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గారు కూడా 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని గుర్తు చేస్తూ, నేడు తెలంగాణలో కూడా అటువంటి అరాచక పరిస్థితులే రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం’ పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో గూండా రాజ్యాన్ని నడుపుతోందని మండిపడ్డారు. రాఘవ కనస్ట్రక్షన్స్ సంస్థ జంట జలాశయాల పరిధిలో మైనింగ్ నిషేధం ఉన్నప్పటికీ, ఎటువంటి అనుమతులు లేకుండానే నిరాటంకంగా తవ్వకాలు జరుపుతోందని ఆరోపించారు. కనీసం పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్స్, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతులు కూడా లేకుండా వందల కోట్ల విలువైన సంపదను కొల్లగొడుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో ఈ అక్రమాలపై గళమెత్తితే విపక్ష సభ్యులను సామూహికంగా బహిష్కరించడం ద్వారా ప్రభుత్వం తన నియంతృత్వ ధోరణిని చాటుకుందని కేటీఆర్ విమర్శించారు. సభలోనే ప్రభుత్వం ఒకానొక దశలో సదరు కంపెనీ తప్పు చేసిందని ఒప్పుకుని నోటీసులు ఇచ్చామని చెప్పిందని, అలాంటప్పుడు పారదర్శకమైన విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హోమ్ శాఖను నిర్వహిస్తున్న తరుణంలో, ఆయన పరిధిలోని సీబీసీఐడీ లేదా రాష్ట్ర పోలీసు సంస్థల విచారణపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీల (JPC) గురించి మాట్లాడే రాహుల్ గాంధీ పార్టీ, ఇక్కడ తెలంగాణలో మాత్రం సభా సంఘాలకు (House Committees) విలువ లేదని చెప్పడం వారి ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, రాష్ట్రంలో ఆయన కంటే పెద్ద బ్లాక్ మెయిలర్ మరొకరు లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఆర్టీఐని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన చరిత్ర రేవంత్ రెడ్డిదని, ఇప్పుడు పొంగులేటి అక్రమాలను అడ్డుపెట్టుకుని తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పొంగులేటిని మంత్రివర్గం నుంచి తొలగించి, సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. కేవలం పొంగులేటి అక్రమాలే కాకుండా అమృత్ పథకం, ఫోన్ ట్యాపింగ్, సింగరేణి, మరియు పారిశ్రామిక భూముల కేటాయింపుల్లో జరిగిన 14 ప్రధాన కుంభకోణాలపై ఆధారాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వీటిపై విచారణ చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని నిలదీశారు.

ఈ మొత్తం వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న మౌనం పట్ల కూడా కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, ఇక్కడ జరుగుతున్న ప్రజాధనం దోపిడీపై బీజేపీ ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. గవర్నర్‌కు తాము ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రభుత్వం స్పందించకుంటే, నేరుగా ప్రజా క్షేత్రంలోనే ఈ అక్రమాలను ఎండగడతామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, అక్రమ మైనింగ్ ఆగే వరకు బీఆర్ఎస్ పోరాటం విశ్రమించబోదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన ఆధారాలను పరిశీలించిన గవర్నర్, ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తానని హామీ ఇచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Latest