Mahaa Daily Exclusive

  మతం మారినా మాయని వివక్ష..! సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ అసహనం..!

Share

  •  1950 రాష్ట్రపతి ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం.
  •  కుల వ్యవస్థ రద్దుకు రాజకీయ పార్టీలు సిద్ధమా?
  •  వివక్ష మూలాలపై దాడి చేయాలి.
  •  మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్!

హైదరాబాద్, మహా.

దేశంలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న సామాజిక అసమానతలకు మత మార్పిడి పరిష్కారం కాదని, అసలు సమస్య కుల వ్యవస్థలోనే ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ, పార్లమెంటు, రాష్ట్రపతికి సామాజిక న్యాయంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మతం ప్రాతిపదికన హక్కులను కాలరాయడం మానేసి, దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్పు సామాజిక వాస్తవాలకు దూరంగా ఉందని, వివక్షతో కూడిన పాత నిబంధనలను పట్టుకుని వేలాడటం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చిందని, అయితే ఆ ఉత్తర్వులే ప్రాథమికంగా వివక్షతో కూడుకున్నవని మంద కృష్ణ విమర్శించారు. దళితుల హక్కులను హరించేలా ఉన్న ఆ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కుల వ్యవస్థ కారణంగా దళితులు కొన్ని శతాబ్దాలుగా పశువుల కంటే హీనంగా చూడబడ్డారని, అంటరానితనం అనే అగ్నిగుండంలో మాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్ష రాత్రికి రాత్రే మాయం కాదని, సమాజం చూసే చూపు మారనప్పుడు వారి ఎస్సీ హోదాను తొలగించడం ఏ రకమైన న్యాయమని ఆయన నిలదీశారు. మతం అన్నది వ్యక్తిగత విశ్వాసమని, దానిని సామాజిక హోదాతో ముడిపెట్టి శిక్షించడం దళితుల అభ్యున్నతికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు.

దేశంలోని ప్రస్తుత కుల నిర్మాణంలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ ఏదో ఒక రకమైన బాధితులేనని మంద కృష్ణ విశ్లేషించారు. సమాజంలో ఏ రెండు కులాల మధ్య సరైన సామరస్యం లేదని, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే క్రమంలో అందరూ నష్టపోతున్నారని తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవస్థలో కేవలం బ్రాహ్మణ వర్గం మాత్రమే అత్యున్నత గౌరవాన్ని, ఆధిపత్యాన్ని పొందుతోందని ఆయన ఆరోపించారు. సమానత్వాన్ని కాంక్షించే వారు ఎవరైనా కుల నిర్మూలన కోసమే పోరాడాలని, అసమానతలు కావాలనుకునే వారే ఈ వ్యవస్థను కాపాడుకోవాలని చూస్తారని విమర్శించారు. కుల వ్యవస్థ ఏ మూలాల నుంచి పుట్టిందో, దాని నిర్మూలనకు ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా ఉందో ప్రజలకు బహిరంగంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

కుల వ్యవస్థ రద్దు దిశగా అడుగులు వేసే ఏ రాజకీయ పార్టీకైనా, సంస్థకైనా ఎమ్మార్పీఎస్ తరఫున తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని మంద కృష్ణ వెల్లడించారు. ఓట్ల రాజకీయం కోసం కులాలను వాడుకుంటున్న పార్టీలు, కుల నిర్మూలనపై తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కోరారు. సుమ్రీంకోర్టు తీర్పు వల్ల ఇప్పటికే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మరింత అన్యాయం జరుగుతుందని, దీనిపై న్యాయస్థానం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అంటరానితనం పోవాలంటే కేవలం చట్టాలు సరిపోవని, కుల వ్యవస్థ ప్రాతిపదికనే తుడిచిపెట్టే ధైర్యమైన నిర్ణయాలు కావాలని ఆయన పునరుద్ఘాటించారు. సామాజిక న్యాయం అన్నది మతం రంగుతో కాకుండా, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అందాలని ఆయన ఆకాంక్షించారు.

Latest