Mahaa Daily Exclusive

  త్వరలో బసవతారకం ఆసుపత్రి విస్తరణ..-:నందమూరి బాలకృష్ణ..

Share

  • పేదలకు మెరుగైన క్యాన్సర్‌ చికిత్స అందించడమే లక్ష్యం.
  •  బీడీఎల్‌ అందించిన వైద్య పరికరాల ప్రారంభం.

హైదరాబాద్, మహా.

హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని త్వరలోనే మరింత విస్తరించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. మంగళవారం ఆసుపత్రి ఆవరణలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ విరాళంగా అందజేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్‌ యంత్రం, అధునాతన అంబులెన్స్‌తో పాటు పలు వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా నిరుపేదలకు క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు.

దాతల సహకారంతో ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల రోగులకు మరింత నాణ్యమైన సేవలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. బీడీఎల్ సంస్థ సామాజిక దృక్పథంతో ముందుకొచ్చి క్యాన్సర్ బాధితుల కోసం స్కానింగ్ యంత్రాన్ని అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచేలా మరిన్ని వార్డులు, అత్యాధునిక సౌకర్యాలతో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఎంతోమంది దాతలు అందిస్తున్న తోడ్పాటుతోనే బసవతారకం ఆసుపత్రి నేడు దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ సేవా కేంద్రాలలో ఒకటిగా నిలిచిందని, పేదల ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని బాలకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు, బీడీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest