- అసంపూర్తి పనులతోనే ఆఖరి బిల్లుకు గ్రీన్ సిగ్నల్.
- ప్లాస్టరింగ్, వైరింగ్ కాకున్నా నిధుల విడుదల..
- లబ్ధిదారుల ఇబ్బందుల దృష్ట్యా సర్కారు సడలింపు
హైదరాబాద్, మహా.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఇంటి కలను నిజం చేసుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగించలేకపోతున్న పేదలకు అండగా నిలిచేందుకు నిబంధనల్లో కీలక సడలింపులు ఇచ్చింది. ఇంటి నిర్మాణం కప్పు దశ దాటినప్పటికీ, ప్లాస్టరింగ్, విద్యుత్తు వైరింగ్ వంటి తుది దశ పనులు పూర్తి చేయలేకపోతున్న వారికి కూడా ఆఖరి విడత బిల్లులు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం, చిన్న చిన్న పనుల సాకుతో నిధులను నిలిపివేయవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఇంటి గోడలకు లోపల, బయట ప్లాస్టరింగ్ పూర్తి కావడంతో పాటు, విద్యుత్తు వైరింగ్, గచ్చు, సున్నం లేదా రంగులు వేయడం, తలుపుల బిగింపు వంటి పనులన్నీ పూర్తయితేనే ఆఖరి బిల్లుకు అవకాశం ఉండేది. అయితే తాజాగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నా నిధులు విడుదల చేయనున్నారు. బయట గోడలకు ప్లాస్టరింగ్ చేసి లోపల చేయకపోయినా, ప్రాథమిక కోటింగ్ వేసి వదిలేసినా, అన్ని గదుల్లో గచ్చు పనులు పూర్తి కాకున్నా బిల్లుల మంజూరుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రధాన ద్వారానికి తలుపు ఉండి, లోపలి గదులకు లేకున్నా, పూర్తిస్థాయి ప్లంబింగ్, వైరింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నా ప్రస్తుత స్థితిని ఫొటోలు తీసి బిల్లుల కోసం సిఫార్సు చేయవచ్చు.
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మంజూరైన 42,627 గృహాలలో ఇప్పటికే 16,949 ఇళ్లు కప్పు దశకు చేరుకున్నాయి. వీటిలో జనగామ జిల్లాలో 2,958 ఇళ్లు, ములుగులో 1,560, మహబూబాబాద్‌లో 4,476, వరంగల్ జిల్లాలో 3,637, హనుమకొండలో 3,134 మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,184 ఇళ్లు కప్పు దశ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. తాజా సడలింపులతో ఈ ఇళ్లన్నింటికీ చివరి విడత నిధులు అందే మార్గం సుగమమైంది. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు అటువంటి ఇళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
మరోవైపు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే రెండు నెలల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఏటా ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తామని, గతంలో సగంలో నిలిచిపోయిన గృహాలకు కూడా ఆర్థిక సాయం అందించేలా వచ్చే ఏడాది ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి లక్ష గృహాలు, జూన్ లేదా జులై నాటికి మొత్తం 3 లక్షల ఇళ్లు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదుల కోసం త్వరలోనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.








