- నలందలో ఘోర విషాదం.
- శీతలామాత ఆలయంలో తొక్కిసలాట.
- తొమ్మిది మంది మహిళల మృతి.
- మహావీర జయంతి వేళ పెను ప్రమాదం.
- ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనసమూహం.
- మృతులకు రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా.
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని
నలంద (బిహార్), మహా.
బిహార్‌లోని నలంద జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం మాఘ్రా గ్రామంలోని చారిత్రక శీతలామాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహావీర జయంతి, చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. కళ్లముందే బంధువులు, తోటి భక్తులు ప్రాణాలు విడవడంతో ఆలయ ప్రాంగణం ఆర్తనాదాలతో దద్దరిల్లింది. గాయపడిన పది మందికి పైగా భక్తులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
మృతుల్లో సకుంత్ బిహార్‌కు చెందిన రీతా దేవి (50), నూర్‌సరాయ్ మథురాపూర్‌కు చెందిన రేఖా దేవి (45)లను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మిగిలిన మృతుల వివరాలను సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతి మంగళవారం ఇక్కడ నిర్వహించే ‘మంగళ మేళా’కు తోడు పండుగ రోజు కావడంతో భక్తుల రద్దీని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యారికేడ్లు సరిగా లేకపోవడం, పోలీసు బందోబస్తు కొరత వల్లే ఈ అనర్థం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం గట్టిగా కేకలు వేయడంతో ఏదో ప్రమాదం జరిగిందన్న భయంతో భక్తులు పరుగులు తీశారని, అదే తొక్కిసలాటకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ఘోర ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం నలంద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆమె, భక్తుల మరణవార్త విని కలత చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు, ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆలయం వద్ద దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.








