Mahaa Daily Exclusive

  అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం.. తక్షణమే ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్..

Share

  •  తక్షణమే ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్.
  •  కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై బసవ లక్ష్మీనర్సయ్య నిప్పులు.
  •  ఎకరానికి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలి.
  •  ఫసల్ బీమా యోజన అమలు చేయాలి.. పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలని విన్నపం.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతాంగాన్ని నిలువునా ముంచాయని, చేతికి వచ్చిన పంట నేలపాలవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పసుపు, మిర్చి, మామిడి తోటలు దెబ్బతిన్నాయని, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 2,600 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా అని వివరించారు. కోతకు వచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని, మొక్కజొన్న చేలు నేలమట్టమయ్యాయని ఆయన క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

రాష్ట్రంలో రైతులు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లక్ష్మీనర్సయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతుల గోడు పట్టించుకోకుండా కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం శోచనీయమని విమర్శించారు. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ద్వారా తక్షణమే మండలాల వారీగా పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించాలని, అప్పుల ఊబిలో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ హామీలను, రైతు భరోసా, రుణమాఫీ వంటి వాగ్దానాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ఈ పథకం అమల్లో ఉంటే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు బీమా కంపెనీల నుంచే పరిహారం అందేదని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం తగ్గేదని లక్ష్మీనర్సయ్య వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన మొండివైఖరి వీడి, రాజకీయ ప్రచారాల కంటే రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయకుండా, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Latest