Mahaa Daily Exclusive

  డా. శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక ‘ఎం.ఎస్‌. స్వామినాథన్‌’ జాతీయ పురస్కారం..

Share

హైదరాబాద్‌, మహా.

భారత వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖ శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్‌, వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ సి.హెచ్. శ్రీనివాసరావును ప్రతిష్టాత్మక ‘ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్’ జాతీయ అవార్డు (2024-25)కు ఎంపిక చేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. భారత ఆహార భద్రత కోసం విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలను గుర్తించి గౌరవించే లక్ష్యంతో, నుజివీడు సీడ్స్ లిమిటెడ్ సహకారంతో 2004-05లో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. హరిత విప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్. స్వామినాథన్ జన్మ శతాబ్ది సంవత్సరంలో ఈ అవార్డును ప్రకటించడం విశేషం.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఎనిమిది మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఈ గౌరవాన్ని అందుకోగా, తాజాగా ఆ దిగ్గజాల సరసన డాక్టర్‌ శ్రీనివాసరావు చేరారు. గతంలో ఈ పురస్కారాన్ని డా. గెండా లాల్ జైన్, డా. ఎస్. నాగరాజన్, డా. వి. ప్రవీణ్ రావు, డా. పి.వి. సత్యనారాయణ వంటి ప్రముఖులు అందుకున్నారు. మాజీ ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మోహపాత్ర నేతృత్వంలోని నిపుణుల కమిటీ అత్యంత పారదర్శకంగా ఈ ఎంపికను చేపట్టింది. ఈ కమిటీలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత డాక్టర్ విజయ్ గుప్తా, డాక్టర్ బాల రవి, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా వ్యవహరించారు.

డాక్టర్ శ్రీనివాసరావు పర్యావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, సహజ వనరుల యాజమాన్యంలో కీలక పరిశోధనలు చేశారు. సుమారు 40 లక్షల హెక్టార్లలో వనరుల పరిరక్షణ సాంకేతికతను అమలు చేయడం ద్వారా ఏడాదికి రూ.380 కోట్ల విలువైన డీజిల్ ఖర్చును ఆదా చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. అలాగే దేశవ్యాప్తంగా 637 జిల్లాలకు వ్యవసాయ ఆకస్మిక ప్రణాళికలను రూపొందించడంతో పాటు, 151 వాతావరణ అనుకూల గ్రామాలను అభివృద్ధి చేయడంలో ఆయన కృషి అమోఘం. విద్యా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పటివరకు 363 పరిశోధనా పత్రాలను, 57 పుస్తకాలను ప్రచురించారు.

ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రదానోత్సవం ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో వైభవంగా జరగనుంది. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ శ్రీనివాసరావుకు బంగారు పతకం, ప్రశంసా పత్రం మరియు రూ.2,00,000 నగదును అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గారు పాల్గొననున్నారు. 1973లో ప్రారంభమై విత్తన రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న నూజివీడు సీడ్స్, అలాగే శాస్త్రీయ విజ్ఞానాన్ని రైతులకు చేరువ చేస్తున్న ఐసీఏఆర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

Latest