- 12 ఏళ్లు గడిచినా అసంపూర్తిగానే హామీలు.
- ఆస్తుల పంపకాల్లో కేంద్రం జాప్యంపై ధ్వజం
- ఏపీ, తెలంగాణలు కవలపిల్లల వంటివారన్న రేణుకా చౌదరి.. పారదర్శకతకు ఎంపీల డిమాండ్.
ఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా తెలంగాణ ఎంపీలు తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా, నాటి చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇంకా నెరవేర్చకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఇస్తున్న ప్రాధాన్యతను తెలంగాణకు కూడా ఇవ్వాలని, రెండు రాష్ట్రాల పట్ల సమాన వైఖరిని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆస్తుల పంపకం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సాక్షిగా విభజన చట్టంలోని లోపాలను, అమలుకాని వాగ్దానాలను ఎంపీలు ఏకరువు పెట్టారు.
చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి విభజన హామీల అమలుపై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ప్రజలు కవలపిల్లల వంటివారని, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు మరో రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని ఆమె హితవు పలికారు. తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలు దశాబ్ద కాలం దాటినా ఇంకా కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. హామీలను సకాలంలో నెరవేర్చలేనప్పుడు, ఆ జాప్యానికి గానూ తెలంగాణకు ప్రత్యేక పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. సుమారు రూ.1.47 లక్షల కోట్ల విలువైన ఉమ్మడి ఆస్తుల పంపకం ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం కేంద్ర వైఫల్యమేనని ధ్వజమెత్తారు. కేంద్రం రెండు రాష్ట్రాలతో రాజకీయ క్రీడ ఆడుతోందని, దీనివల్ల రెండు చోట్లా అభివృద్ధి కుంటుపడుతోందని ఆమె విమర్శించారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న భౌగోళిక సమస్యలను కూడా రేణుకా చౌదరి సభ దృష్టికి తీసుకువచ్చారు. విభజన సమయంలో నాలుగైదు గ్రామాలు ఏ రాష్ట్రానికీ చెందకుండా పోయాయని, అవి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విభజన హామీల అమలుకు ఒక నిర్ణీత కాలపరిమితిని నిర్ణయించాలని, అత్యంత పారదర్శక విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె కోరారు. భారతీయ జనతా పార్టీతో సఖ్యత ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలను పొందుతోందని, అదే సమయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపకూడదని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూనే, గత పదేళ్లలో జరిగిన పరిణామాలను ఎంపీలు గుర్తుచేశారు. ఈ బిల్లు రావడం అమరావతి రైతుల పోరాట విజయమని కొనియాడారు. రాజధాని ఉద్యమ సమయంలో రైతులు, మహిళలపై జరిగిన హింసను వారు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం అనుసరించిన ‘మూడు రాజధానుల’ విధానం వల్ల రాష్ట్రంలో తీవ్ర అస్పష్టత నెలకొందని, ఆ గందరగోళం కారణంగా భారీ ఎత్తున పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో నెలకొన్న 12 ఏళ్ల నాటి అనిశ్చితికి ఈ బిల్లుతో తెరపడుతుందని భావిస్తున్నామని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అన్ని పెండింగ్ అంశాలను కూడా ఇదే వేగంతో పరిష్కరించాలని తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.








