- ఏపీఎస్పీడీసీఎల్లో 69 మంది షిఫ్ట్ ఆపరేటర్ల తొలగింపు
- ఐటీఐ చదవకుండానే కొలువు.. కడపలోనే అత్యధికం.
- విద్యుత్ శాఖలో నకిలీ రాయుళ్లపై వేటు!
విజయవాడ, మహా.
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో నకిలీ విద్యార్హత పత్రాలతో కొలువులు పొందిన భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. ఐటీఐ (ఎలక్ట్రిషియన్) చదవకుండానే దొంగ సర్టిఫికెట్లు సమర్పించి షిఫ్ట్ ఆపరేటర్లుగా విధుల్లో చేరిన 69 మంది ఉద్యోగులపై యాజమాన్యం వేటు వేసింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వివిధ సబ్స్టేషన్లలో నియామకమైన ఈ సిబ్బంది అక్రమాలను గుర్తించిన ఉన్నతాధికారులు, వారిని తక్షణమే విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి కీలక ఆదేశాలు జారీ చేస్తూ, నియామకాల్లో పారదర్శకతకు తూట్లు పొడిచే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
సంస్థ పరిధిలోని పలు జిల్లాల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు లోతైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న కొందరు అభ్యర్థులు అసలు ఐటీఐ కోర్సు పూర్తి చేయకుండానే ఫోర్జరీ పత్రాలను సమర్పించినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఈ తొలగింపుల్లో అత్యధికంగా కడప జిల్లాకు చెందిన 38 మంది ఉండటం గమనార్హం. వీరితో పాటు కర్నూలు జిల్లాలో 16 మంది, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, తిరుపతి , అనంతపురం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అలాగే అన్నమయ్య జిల్లాలో ఒకరిని విధుల నుంచి తొలగించారు. సంబంధిత సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లు తక్షణమే ఆయా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసి, వీరిని బాధ్యతల నుంచి తప్పించాలని సీఎండీ ఆదేశించారు.
నిర్వహణాపరంగా అత్యంత కీలకమైన సబ్స్టేషన్లలో ఇలాంటి అర్హత లేని వ్యక్తులు విధులు నిర్వహించడం వల్ల వ్యవస్థకు ముప్పు పొంచి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు, నియామక ప్రక్రియలో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం వెనుక ఉన్న మూలాలను కూడా ఆరా తీస్తున్నట్లు, అవసరమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంస్థ యోచిస్తోంది.








