* “నా భార్యపై కేసులెందుకు?” అంటూ సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే.
* పోలీసు వసూళ్లపై విచారణ జరపండి.
* విచారణ ముగిశాక సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం మరోసారి ముదిరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న విమర్శల మధ్య, శనివారం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. గత జనవరి 29న వీణవంకలో జరిగిన సమ్మక్క జాతర సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో పాటు, మత విద్వేష వ్యాఖ్యలు చేశారన్న కేసులో కౌశిక్ రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు ఆయన తన సతీమణితో కలిసి రావడం, విచారణ అనంతరం ప్రభుత్వంపై మరియు పోలీసు ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సుమారు గంటల తరబడి సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిస్తూనే, బయటకు వచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో సర్కార్ తీరును ఎండగట్టారు.
విచారణకు హాజరయ్యే ముందే కౌశిక్ రెడ్డి తన దూకుడు ప్రదర్శించారు. రాజకీయాలతో సంబంధం లేని తన సతీమణిని ఈ కేసులోకి లాగడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. జాతరలో జరిగిన ఒక చిన్న ఘర్షణను సాకుగా చూపి, తన కుటుంబ సభ్యులతో పాటు 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. అసలు ఈ చిన్న స్థాయి కేసును సీఐడీకి అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇది కేవలం తనను భయభ్రాంతులకు గురిచేసేందుకేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి, పోలీసు యంత్రాంగాన్ని తమ రాజకీయ అవసరాల కోసం పావులుగా వాడుకుంటున్నారని, ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు.
కేవలం తనపై ఉన్న కేసుల గురించే కాకుండా, అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలా కౌశిక్ రెడ్డి కొన్ని సంచలన డిమాండ్లను తెరపైకి తెచ్చారు. బోనాలపల్లిలో జరిగిన ఫైరింగ్ ఘటనలో అమృతమ్మ అనే మహిళ మృతి చెందడంపై అసెంబ్లీలోనే ప్రశ్నించానని గుర్తు చేసిన ఆయన, ఆ మృతిపై ఇప్పటి వరకు ఎందుకు సిట్ లేదా సీఐడీ విచారణ జరపలేదని నిలదీశారు. తన విషయంలో ఇంత వేగంగా స్పందించే ప్రభుత్వం, ఒక మహిళ ప్రాణం పోతే ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, అమృతమ్మ మృతిపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసు శాఖలోని అంతర్గత విషయాలను ప్రస్తావిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
కరీంనగర్ జిల్లా పోలీసు యంత్రాంగంలో అవినీతి రాజ్యమేలుతోందని, అక్కడ సిపి హోదాలో ఉన్న వ్యక్తి ఎస్ హెచ్ ఓల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా, అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు విపక్ష నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల వద్ద వసూళ్లు చేస్తున్న సిపిపై విచారణ జరిపే దమ్ము సీఐడీకి ఉందా అని సవాల్ విసిరారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైలుకు పంపినా తాను భయపడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. మొత్తానికి కౌశిక్ రెడ్డి సీఐడీ విచారణ ఉదంతం జిల్లా రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయికి చేరి, అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల మంటలను మరింత రాజేసింది.








