- “స్థలం ఇస్తావా.. బుల్డోజర్ పంపమంటావా?”.
- గోపాల్ నగర్‌లో బడా బాబుల హల్చల్.. యూఎల్సీ భూములపై కబ్జాదారుల కన్ను!
- కోర్టు తీర్పు వచ్చినా తప్పని తిప్పలు.. హైడ్రా ముసుగులో భూ రాబందుల కొత్త ‘స్కెచ్’.
హైదరాబాద్, మహా.
భాగ్యనగరంలో అక్రమ కట్టడాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ పేరు ఇప్పుడు భూ కబ్జాదారులకు ఒక కొత్త ఆయుధంగా మారింది. ప్రభుత్వ ఆశయం గొప్పదైనా, క్షేత్రస్థాయిలో కొందరు బడా బాబులు దీనిని అడ్డం పెట్టుకుని సామాన్యులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఉదంతం కూకట్‌పల్లిలో వెలుగు చూసింది. జేఎన్టీయూ పరిధిలోని గోపాల్ నగర్‌లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సామాన్యులను, మధ్యతరగతి జీవులను లక్ష్యంగా చేసుకుని భూ రాబందులు వేట మొదలుపెట్టాయి. “మర్యాదగా మా దారికి వచ్చి స్థలం అప్పగిస్తారా.. లేక హైడ్రాను పిలిపించి ఇళ్లు కూల్చేయమంటారా?” అంటూ కబ్జాదారులు చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. గోపాల్ నగర్ పరిధిలోని యూఎల్స భూముల్లో సుమారు 20 నుంచి 30 ఏళ్ల క్రితమే చిరుద్యోగులు, సామాన్యులు తమ కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేశారు. అప్పట్లో నిబంధనలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో, రిజిస్ట్రేషన్లు నమ్మి చిన్నపాటి ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే, ఈ భూములపై గత కొన్ని దశాబ్దాలుగా న్యాయస్థానంలో వివాదం నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇటీవల గౌరవ కోర్టు ఈ భూములకు సంబంధించి బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఇన్నాళ్లూ కోర్టు కేసులతో సతమతమైన బాధితులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో, స్థానిక భూ బకాసురుల కన్ను ఈ విలువైన స్థలాలపై పడింది. ఈ ప్రాంతంలో హైరైజ్డ్ బిల్డింగులు నిర్మిస్తే కోట్లాది రూపాయల లాభం వస్తుందని లెక్కలు వేసుకున్న కొందరు కబ్జాదారులు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడం మొదలుపెట్టారు.
ఈ భూముల్లో తాము అపార్ట్‌మెంట్లు నిర్మిస్తామని, యజమానులంతా తమ స్థలాలను అప్పగించాలని కబ్జాదారులు హుకుం జారీ చేస్తున్నారు. దీనికి ఒప్పుకోని పక్షంలో ‘హైడ్రా’ను రంగంలోకి దింపుతామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. “ఇవి ప్రభుత్వ భూములని, మీవన్నీ అక్రమ కట్టడాలని హైడ్రాకు ఫిర్యాదు చేస్తాం.. వారు వచ్చి ఇళ్లు కూల్చేసిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ స్థలమని బోర్డులు పాతించి, మిమ్మల్ని రోడ్డున పడేస్తాం” అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఒకవైపు న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, రాజకీయ అండదండలు ఉన్న బడా బాబులు ఇలా హైడ్రా పేరు చెప్పి భయపెడుతుండటంతో బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.
ప్రభుత్వం చెరువులను, ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రతిష్టాత్మక సంస్థను, ఇలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్న భూ రాబందులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదని, అది సామాన్యులకు భరోసా ఇచ్చే సంస్థగా ఉండాలని వారు కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గోపాల్ నగర్ బాధితులకు రక్షణ కల్పించాలని, హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తున్న ముఠాలను అదుపు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే, సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు ‘హైడ్రా’ ఒక సాకుగా మారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.








