హైదరాబాద్: మహా.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచిస్తోందని, అభివృద్ధిలో ‘డీలా’ పడి కేవలం ప్రచారానికే పరిమితమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తీరును ‘ఇంట్లో జీరో.. బయట హీరో’ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పుడు ఆరు మోసాలుగా మారాయని, అభయహస్తం కాస్తా భస్మాసుర హస్తంగా మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి, పార్టీకి మూటలు పంపడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనను విశ్లేషిస్తూ ఇది ఒక ‘5D’ మోడల్ అని బూర నర్సయ్య గౌడ్ అభివర్ణించారు. డైవర్షన్ (మళ్లింపు), డిమాండ్ (అధికార దర్పం), డిమాలిషన్ (కూల్చివేతలు), డెబ్ట్ (అప్పులు), డిఫాల్ట్ (వైఫల్యం) అనే ఐదు సూత్రాల మీదనే ఈ సర్కార్ నడుస్తోందని విమర్శించారు. నిత్యం ప్రజల దృష్టిని మళ్లించడం, అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయించడం తప్ప ఈ ప్రభుత్వానికి మరో ధ్యేయం లేదని పేర్కొన్నారు. కేవలం 28 నెలల కాలంలోనే రూ.3.47 లక్షల కోట్ల భారీ అప్పు చేసి రికార్డు సృష్టించారని, కాగ్ మరియు ఆర్బీఐ నివేదికలను పరిశీలిస్తే.. గత ఆర్థిక సంవత్సరంలోని 365 రోజుల్లో 363 రోజులు ప్రభుత్వం అప్పుల మీదనే ఆధారపడి గడిపిందని గణాంకాలతో వివరించారు. ఈ ప్రభుత్వం ఒక ‘దినసరి కూలీ’ తరహాలో రోజువారీ అప్పులతో నెట్టుకొస్తోందని విమర్శించారు.
దళిత, గిరిజన విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని బూర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.263 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను జమ చేయకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తును బొందపెట్టడమేనని మండిపడ్డారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లకపోవడం వెనుక ఈ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేసే కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ఫీజులు తామే కట్టుకోవాలనే పరిస్థితికి తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, దీనిపై విద్యార్థి లోకం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.
టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ నంబర్ వన్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కేవలం పగటి కలలని బూర నర్సయ్య గౌడ్ కొట్టిపారేశారు. గణాంకాల ప్రకారం కాటన్ ఉత్పత్తిలో మహారాష్ట్ర, గుజరాత్ మొదటి రెండు స్థానాల్లో ఉంటే తెలంగాణ మూడో స్థానంలో ఉందని, గార్మెంట్ తయారీ మరియు ఎగుమతుల్లో తెలంగాణ కనీసం టాప్-10 లో కూడా లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే ఆసియాలోనే నంబర్ వన్ చేస్తామని ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. వరంగల్ సమీపంలో ప్రధాని మోదీ మంజూరు చేసిన ‘పీఎం మిత్ర’ మెగా టెక్స్‌టైల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగినప్పటికీ ప్రధాని మోదీ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు ఆటంకం లేకుండా చూస్తుంటే, తెలంగాణలో మాత్రం కృత్రిమ కొరత సృష్టించి ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇందులో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. దేశం మొత్తం ప్రధాని మోదీ నాయకత్వంలో ‘విశ్వగురు’ దిశగా సాగుతుంటే, తెలంగాణ మాత్రం తిరోగమనంలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకుని, అబద్ధపు ప్రచారాలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.








