Mahaa Daily Exclusive

  మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వీడని ఉత్కంఠ..

Share

  •  ముగిసిన నిందితుల కస్టడీ!
  •  పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురికి ఏప్రిల్ 8 వరకు రిమాండ్.
  •  కస్టడీ పొడిగింపుపై సోమవారానికి విచారణ వాయిదా.
  •  ఉప్పర్‌పల్లి కోర్టులో హోరాహోరీగా సాగిన న్యాయవాదుల వాదనలు.

 

రాజేంద్రనగర్, మహా.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మల ఆరు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు భారీ భద్రత నడుమ నిందితులను ఉప్పర్‌పల్లిలోని ఎనిమిదవ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కోర్టు హాల్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో వాతావరణం యుద్ధ ప్రాతిపదికన తలపించింది.

నిందితుల నుంచి మరిన్ని కీలక విషయాలను రాబట్టాల్సి ఉందన్న కారణంతో, వారి కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని సిట్ అధికారులు న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఆరు రోజుల పాటు నిందితులను కస్టడీలోకి తీసుకున్న అధికారులు, సుదీర్ఘంగా విచారణ జరిపారని, ఇప్పుడు మళ్ళీ కస్టడీ కోరడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు సంస్థలు కోరిన ప్రతిసారీ కస్టడీ ఇవ్వడం నిందితుల హక్కులకు భంగం కలిగించడమేనని వారు వాదించారు. ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా విన్న న్యాయమూర్తి, సిట్ అధికారుల కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై లోతైన విచారణ జరిపేందుకు సోమవారానికి సమయం ఇచ్చారు.

అదేవిధంగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా సోమవారమే వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో సోమవారం నాడు రాబోయే తీర్పుపై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతానికి ముగ్గురు నిందితులకు ఏప్రిల్ 8వ తేదీ వరకు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, పోలీసులు వారిని తిరిగి జైలుకు తరలించారు. ఫామ్‌హౌస్ పార్టీలో డ్రగ్స్ వినియోగం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, దీనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే అంశాలపై సిట్ అధికారులు ఇప్పటికే సేకరించిన సమాచారం సోమవారం నాటి విచారణలో కీలకం కానుంది. నిందితులకు బెయిల్ దక్కుతుందా లేక సిట్ కస్టడీ పొడిగించబడుతుందా అన్న అంశం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.