- అంగరంగ వైభవంగా చంద్ర రథోత్సవం!
- :భక్తజన సంద్రమైన ఇల్లందకుంట క్షేత్రం.
- లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
- స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.
- ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా: ఎంపీ ఈటల రాజేందర్.
ఇల్లందకుంట, మహా.
అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ‘చంద్ర రథోత్సవం’ శనివారం రామనామ స్మరణతో, భక్తజన సంద్రం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా పట్టు వస్త్రాలు, విశేష పుష్పాలంకరణలతో అలంకరించి, ప్రత్యేక పూజల అనంతరం భారీ రథంపై అధిష్టింపజేశారు. రథం కదిలిన వేళ భక్తుల జయజయధ్వానాలతో ఇల్లందకుంట పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ రథోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వామివారికి భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ వేడుకను వీక్షించేందుకు కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి తదితర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇల్లందకుంట ఆలయం సాక్షాత్తూ శ్రీరాముడు నడియాడిన పవిత్ర ప్రాంతమని, ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలవడం విశేషమని కొనియాడారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం వేలాది జంటల వివాహాలకు వేదికగా నిలుస్తోందని చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, రాబోయే రోజుల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో అరాచక పాలన అంతం కావాలని, ప్రజలందరికీ మంచి జరగాలని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తాను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకున్నట్లు ఈటల రాజేందర్ వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు తాగునీరు, అన్నప్రసాదం వంటి సదుపాయాలను స్వచ్ఛంద సంస్థలు, ఆలయ యంత్రాంగం సమకూర్చాయి. రథోత్సవం సాగినంత సేపు భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ వేడుకతో ఇల్లందకుంట పట్టణం కాషాయ వర్ణంగా మారి, భక్తి పారవశ్యంతో పులకించిపోయింది.








