- రేవంత్ సర్కారుపై ఈటల నిప్పులు!
- ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు కోసం ఇక్కడి నిధుల మళ్లింపు.
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం.
- ఆరు గ్యారెంటీలతో ప్రజలను నిలువునా వంచించారని ఆగ్రహం.
హైదరాబాద్, మహా .
తెలంగాణ రాష్ట్ర సంపదను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా కొల్లగొడుతున్నారని, ఇక్కడి ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం మళ్లిస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ నిధులను అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే పని చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల కష్టార్జితాన్ని పక్క రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తును రేవంత్ సర్కారు అంధకారంలోకి నెట్టేస్తోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థులను మోసం చేసిందని, ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నర ఏళ్ల కాలంలో కేవలం రూ. 600 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి విద్యాసంస్థలు మూతపడే స్థితికి వచ్చాయని, విద్యార్థులు చదువుకు దూరమవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల నిలుపుదల పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, తక్షణమే పూర్తిస్థాయి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 66 హామీల పరిస్థితి ఇప్పుడు ‘గోడ మీద రాతల’కే పరిమితమైందని ఈటల రాజేందర్ విమర్శించారు. అధికారం దక్కించుకోవడానికి ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను నిలువునా వంచించారని, ఇప్పుడు ఆ హామీల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. చట్టసభల్లో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సింది పోయి, ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగడం అప్రజాస్వామికమని హితవు పలికారు. మరోవైపు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. భూ దందాలకు పాల్పడుతున్న వారిపై ప్రజలు త్వరలోనే తిరగబడతారని, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టే వరకు తాము విశ్రమించబోమని ఈటల స్పష్టం చేశారు.








