Mahaa Daily Exclusive

  విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానం.: ముఖ్యమంత్రి చంద్రబాబు.

Share

అమరావతి, మహా.

గత ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసానికి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అర్థరహిత విమర్శలకు రాజధాని అమరావతి పునర్నిర్మాణం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ద్వారానే దీటైన సమాధానం చెబుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన పార్టీ నాయకుల శిక్షణ తరగతులకు ఆయన స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజాక్షేత్రంలో మనం చేసే పనులే మన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయని ఉద్ఘాటించారు.

రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం చేసిన కుట్రలను, సృష్టించిన అడ్డంకులను ప్రజలు గమనించారని, ఇప్పుడు మళ్ళీ అదే పాత పద్ధతిలో విమర్శలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అభివృద్ధి మంత్రమే పరమావధిగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, విపక్షాల అసత్య ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. నాడు అమరావతిని అడవి అన్నవారే, నేడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం రాజకీయ నాయకులకు అత్యవసరమని, అందుకే ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి కష్టార్జితం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శిక్షణ తరగతుల అనంతరం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు కీలక అంశాలపై ఆయన ముచ్చటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పుడితేట చేస్తూనే, విభజన హామీల సాధన కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు, మంత్రులు , వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.