Mahaa Daily Exclusive

  భాగ్యనగరవాసులకు ‘ఎర్లీ బర్డ్’ ఊరట…

Share

భాగ్యనగరవాసులకు ‘ఎర్లీ బర్డ్’ ఊరట.
* ముందస్తు ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ.
*ఏప్రిల్ 30వ తేదీయే గడువు.
* పన్ను చెల్లింపుల్లో పారదర్శకతకు పెద్దపీట.
*ప్రస్తుత ఏడాది పన్నుపైనే డిస్కౌంట్ వర్తింపు..
* సద్వినియోగం చేసుకోండి కమిషనర్ ఆర్.వి. కర్ణన్.

హైదరాబాద్, మహా.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఆస్తి యజమానులకు పురపాలక శాఖ తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) సంబంధించిన ఆస్తి పన్నును గడువు కంటే ముందే చెల్లించే పౌరులను ప్రోత్సహించేందుకు ‘ఎర్లీ బర్డ్’ పథకాన్ని మరోమారు తెరపైకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నగర అభివృద్ధిలో పౌరులను భాగస్వామ్యం చేయడంతో పాటు, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మున్సిపల్ ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఆకర్షణీయమైన రాయితీని పొందాలనుకునే వారు ఏప్రిల్ 30వ తేదీ లోపు తమ ఆస్తి పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధనను అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ ఐదు శాతం రాయితీ కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ గతానికి సంబంధించిన బకాయిలు ఏవైనా ఉంటే, వాటిపై ఎటువంటి డిస్కౌంట్ లభించదు. పన్ను చెల్లింపుదారులు మొదట తమ పాత బకాయిలను క్లియర్ చేసి, అనంతరం ఈ ఏడాది పన్నును ముందస్తుగా కట్టడం ద్వారా ఐదు శాతం వరకు నగదును ఆదా చేసుకోవచ్చని కమిషనర్ వివరించారు. ఈ వెసులుబాటు నివాస గృహాలతో పాటు వాణిజ్య సంస్థలకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
నగరవాసుల సౌకర్యార్థం పన్ను చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మై జీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇంట్లో కూర్చునే సులభంగా పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా లావాదేవీలు జరపవచ్చు. డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయలేని వారు మీ-సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లు లేదా బిల్‌ కలెక్టర్ల వద్ద ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఏప్రిల్ నెలాఖరు దాటితే ఈ రాయితీ వర్తించదని, కాబట్టి గడువులోపే పన్ను చెల్లించి బాధ్యతాయుతమైన పౌరులుగా నగర పురోగతికి తోడ్పడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.