Mahaa Daily Exclusive

  499/500 వచ్చినా అసంతృప్తే…

Share

* ఆ ఒక్క మార్కు కోసం పట్టుబట్టిన విద్యార్థిని.
*సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో కేరళకు చెందిన ఆషిమా అరుదైన ఘనత.
*సైన్స్‌లో 99 మార్కులు రావడంపై పెదవి విరుపు.
*ఇవీ అసలైన టాపర్ల కష్టాలు’ అంటూ నెట్టింట నెటిజన్ల ఫన్నీ కామెంట్స్.
హైదరాబాద్, మహా.
సాధారణంగా బోర్డు పరీక్షల్లో 90 శాతం మార్కులు వస్తేనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పండుగ చేసుకుంటారు. స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటారు. ఇక ఏకంగా 499 మార్కులు వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ, కేరళకు చెందిన ఓ విద్యార్థిని మాత్రం తనకు 499/500 మార్కులు వచ్చినా ఏమాత్రం సంతృప్తి చెందలేదు. తగ్గిన ఆ ఒక్క మార్కును కూడా సాధించి, నూటికి నూరు శాతం పూర్తి స్కోరు (500/500) ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఏకంగా రీవాల్యుయేషన్‌కు (పునర్మూల్యాంకనం) దరఖాస్తు చేసి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
**సైన్స్ చేసిన ద్రోహం.. పట్టుబట్టిన ఆషిమా**
ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో కేరళకు చెందిన ఆషిమా అనే విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఏకంగా 499 మార్కులు సాధించి సత్తా చాటింది. అయితే, అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు (100) మార్కులు సాధించిన ఆషిమాకు.. సైన్స్ సబ్జెక్టులో మాత్రం 99 మార్కులు మాత్రమే వచ్చాయి. తాను సైన్స్ పరీక్ష కూడా అద్భుతంగా రాశానని, అందులోనూ కచ్చితంగా పూర్తి మార్కులు రావాల్సిందేనని ఆమె బలంగా నమ్ముతోంది. మూల్యాంకనంలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగి తనకు అన్యాయం జరిగిందని భావించిన ఆషిమా.. ఆ ఒక్క మార్కును తిరిగి పొందేందుకు రీవాల్యుయేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఎలాగైనా ఆ ఒక్క మార్కును తిరిగి సాధించి 500/500 రికార్డు సృష్టిస్తానని ఆమె అచంచలమైన విశ్వాసంతో చెబుతోంది.
**’టాపర్ కష్టాలు ఇవే’.. నెట్టింట వైరల్**
ఆషిమా సాధించిన స్కోరు, ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా పాస్ మార్కుల కోసం, లేదా ఫెయిల్ అయిన సబ్జెక్టును గట్టెక్కించుకోవడం కోసం విద్యార్థులు దేవుళ్లకు మొక్కుకుంటూ రీవాల్యుయేషన్లు పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఇలా 499 మార్కులు వచ్చి కూడా కేవలం ఒక్క మార్కు కోసం పోరాడటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.