* కవితతో ఖమ్మం మాజీ జెడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర భేటీ.
* పెసా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని జాగృతి అధ్యక్షురాలి ఆగ్రహం.
* ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం జేఏసీకి సంపూర్ణ మద్దతు.
*నూతన రాజకీయ పార్టీ దిశగా అడుగులు?
హైదరాబాద్, మహా.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో ఆదివాసీ హక్కుల సాధనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కీలక నేతల తాజా భేటీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆల్ ఇండియా ఆదివాసీ కాన్‌స్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ జాతీయ చైర్మన్, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర.. తన బృందంతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ మర్యాదపూర్వక కలయికలో జాతీయ స్థాయిలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. చందా లింగయ్య దొరతో పాటు జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు తదితరులు ఈ భేటీలో పాల్గొని అడవి బిడ్డల అస్తిత్వ పోరాటానికి అండగా నిలవాలని కవితను కోరారు.
కేంద్ర ప్రభుత్వ తీరుపై కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ మూలవాసులైన ఆదివాసీల హక్కులను కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలరాస్తోందని, ఏజెన్సీ ప్రాంతాల్లో స్వయంపాలన కల్పించే పెసా చట్టానికి నిలువునా తూట్లు పొడుస్తోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్ల ద్వారా గిరిజనులకు కల్పించబడిన ప్రత్యేక రక్షణలను సైతం కేంద్ర పెద్దలు క్రమంగా తొలగిస్తూ వారి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంతో సుమారు 3 లక్షల మంది అమాయక ఆదివాసీలను తమ సొంత అడవి నుంచి అత్యంత పాశవికంగా దూరం చేస్తున్నారని, కనీసం వారికి అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించడంలోనూ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని కవిత కుండబద్దలు కొట్టారు. ఆదివాసీల హక్కులను పరిరక్షించేందుకు చందా లింగయ్య దొర నేతృత్వంలోని జేఏసీ చేస్తున్న అలుపెరగని పోరాటానికి తెలంగాణ జాగృతి పక్షాన ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
రాబోయే జాతీయ జనగణనలో (సెన్సస్) మతం కేటగిరీ కింద ఆదివాసీలకు ప్రత్యేకంగా ఒక కాలమ్ కచ్చితంగా ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రత్యేక కాలమ్ లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకునే పరిస్థితి లేకుండా పోయిందని, ఇది ముమ్మాటికీ భారతీయ సంస్కృతిని తీవ్రంగా అవమానించడమేనని ఆమె విశ్లేషించారు. ఆదివాసీలు అత్యంత పవిత్రంగా భావించే ‘కోయతూర్’ భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో తక్షణమే చేర్చాలని ఆమె ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 12 కోట్ల మంది ఆదివాసీలే భారతదేశ నిజమైన సంస్కృతికి ప్రతినిధులని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా తాము భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.







