Mahaa Daily Exclusive

  ఉపాధి బకాయిలు తక్షణమే విడుదల చేయాలి….

Share

ఉపాధి బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

* కేంద్రానికి తేల్చిచెప్పిన మంత్రి సీతక్క.

*వీబీజీ రాంజీ చట్టం అమలుపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపండి.

*60 రోజుల ‘ఉపాధి హాలిడే’తో గ్రామీణ వలసలకు తీవ్ర ముప్పు.

*మారుమూల ప్రాంతాల్లో ఫోటో క్యాప్చర్ నిబంధన ఆచరణ సాధ్యం కాదు.

*కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి సీతక్క.

హైదరాబాద్, మహా

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, నూతనంగా తీసుకువస్తున్న వీబీజీ రాంజీ చట్టం విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కీలక ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తన గళాన్ని బలంగా వినిపించారు. ములుగు జిల్లా రాయినిగూడెం పర్యటనలో ఉన్న ఆమె, అక్కడి నుంచే నేరుగా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక భేటీలో.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు, నూతన చట్టంలోని లోపాలు, క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న రోజువారీ సాంకేతిక సమస్యలను ఆమె సవివరంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్రం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ దివ్య దేవరాజన్ సైతం పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగించాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు రావాల్సి ఉందని, పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన 317 కోట్ల రూపాయల వేతన బకాయిలతో కలుపుకుని, మొత్తంగా 1,110 కోట్ల రూపాయల నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్న వాస్తవాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత వేసవి కాలం ఉపాధి హామీ పనులకు అత్యంత కీలకమైన పీక్ సీజన్ అని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించకపోతే నిరుపేదలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలలో జాప్యం జరిగితే దశాబ్దాలుగా పేదలకు అండగా ఉంటున్న ఈ చారిత్రక పథకం పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

ఇదే సమావేశంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన ‘వీబీజీ రాంజీ’ చట్టంపై మంత్రి సీతక్క తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి, క్షేత్రస్థాయి సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ నూతన చట్టంలో 60 రోజుల పాటు ‘ఉపాధి హాలిడే’ను ప్రకటించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పల్లెల్లో చేతినిండా పని దొరకని పక్షంలోనే కూలీలు ఈ పథకాన్ని నమ్ముకుంటారని, అలాంటిది ఏకంగా రెండు నెలల పాటు పనులు నిలిపివేస్తే వారు బతుకుదెరువు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాలకు వలస వెళతారని వివరించారు. అలా వలస వెళ్లిన కూలీలు తిరిగి గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉండదని, దీనివల్ల గ్రామీణ వలసలను అరికట్టాలన్న ఉపాధి హామీ పథకం అసలు లక్ష్యమే శాశ్వతంగా నీరుగారిపోతుందని ఆమె కేంద్రానికి తేల్చిచెప్పారు.

క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనుల అమలులో ఎదురవుతున్న తీవ్ర సాంకేతిక సమస్యలపై కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క వాస్తవ పరిస్థితులను వివరించారు. ఉపాధి పనుల పర్యవేక్షణ పేరిట కేంద్రం రోజుకో కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావడం అధికారుల్లో, కూలీల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్ల ద్వారా కూలీల పని ప్రదేశాలను ఫోటో క్యాప్చర్ (హాజరు) చేయాలనే నిబంధన మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏమాత్రం ఆచరణసాధ్యం కావడం లేదన్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లో కనీస మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉండదని, అలాంటి చోట ఆన్‌లైన్‌లో ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయడం సాధ్యపడదన్నారు. కేవలం సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్క పేదవాడికి ఉపాధి దూరం కాకూడదని, ఈ సాఫ్ట్‌వేర్,ఆన్‌లైన్ ఫోటో అప్‌లోడ్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలని మంత్రి సీతక్క గట్టిగా డిమాండ్ చేశారు.