* కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత
* కాంగ్రెస్‌లో దక్కని ప్రాధాన్యం.
* ఇచ్చోడలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు.. హైదరాబాద్, మహా.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు రాథోడ్ బాపూరావు ఆదివారం అధికారికంగా తెలంగాణ జాగృతిలో చేరారు. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు స్వయంగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాపూరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయన్న ఉద్దేశంతోనే నాడు తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ బోథ్ నియోజకవర్గంలో ప్రజాసేవకు అంకితమయ్యానని రాథోడ్ బాపూరావు గుర్తు చేసుకున్నారు. దట్టమైన అడవులున్న ఆదిలాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత నాడు స్వయంగా వారం రోజుల పాటు బస చేసి మెడికల్ క్యాంపు నిర్వహించడం తనను ఎంతగానో ఆకర్షించిందని ఆయన తెలిపారు. కవిత అండగా ఉన్నారన్న అపారమైన ధైర్యంతోనే తాను ఉద్యోగాన్ని సైతం వదులుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. బోథ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని, మధ్యలో వచ్చిన వారు ఏకంగా మంత్రులు అయిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనకు ముచ్చటగా మూడవసారి టికెట్ నిరాకరించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు.
సొంత పార్టీలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, అక్కడ కూడా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని రాథోడ్ బాపూరావు కుండబద్దలు కొట్టారు. అందుకే కల్వకుంట్ల కవిత నాయకత్వంలో త్వరలో ఏర్పాటు కాబోతున్న నూతన రాజకీయ పార్టీలో తాను క్రియాశీలక పాత్ర పోషించబోతున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల కవిత మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే ఇచ్చోడ వేదికగా ఒక అత్యంత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, వేలాది మంది కార్యకర్తలను పార్టీలో జాయిన్ చేయిస్తానని బాపూరావు స్పష్టం చేశారు. బాపూరావు వ్యాఖ్యల ద్వారా కవిత త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం దాదాపు ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు బలంగా అంచనా వేస్తున్నారు.








