Mahaa Daily Exclusive

  తమిళనాడులో ఘోర విషాదం…

Share

* బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.
* 18 మంది సజీవదహనం.
* మరో 9 మంది పరిస్థితి విషమం.
*విరుదునగర్‌ను కుదిపేసిన భారీ పేలుడు.
* పేకమేడలా కుప్పకూలిన భవనం.
*మిన్నంటిన మంటలు, హాహాకారాలు.
* సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది**

చెన్నై , మహా.
తమిళనాడు రాష్ట్రాన్ని భారీ పేలుడు తీవ్రంగా కుదిపేసింది. విరుదునగర్ జిల్లాలో ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదంలో 18 మంది అమాయక కార్మికులు సజీవదహనమయ్యారు. పండుగ పూట వెలుగులు పంచాల్సిన బాణసంచా.. ఆ కార్మికుల ఇళ్లలో తీరని విషాదపు చీకట్లు నింపింది. అకస్మాత్తుగా సంభవించిన ఈ భారీ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమై నేలమట్టమైంది.
**ఎగసిపడిన మంటలు.. ప్రాణాపాయ స్థితిలో క్షతగాత్రులు**
ప్రమాద స్థలంలో ఒక్కసారిగా ఎగసిపడిన భారీ మంటలు, దట్టమైన పొగలు చూసి స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ హృదయ విదారక ఘటనలో ఇప్పటివరకు 18 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మరో 9 మంది కార్మికులు తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. కాలిపోయిన శరీరాలతో ఆసుపత్రి పాలైన వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదచాయలు అలుముకున్నాయి. కాలిన గాయాలు తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
**శిథిలాల కింద గాలింపు.. భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు**
పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాలు భూకంపం వచ్చిన తరహాలో కంపించాయని, భారీ శబ్దంతో భవనం పేకమేడలా కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భవనం శిథిలాల కింద ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకున్నారా అనే కోణంలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఈ పేలుడుకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ఘోరానికి కారణమా, లేక యాజమాన్య తీవ్ర నిర్లక్ష్యం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలవడానికి కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు, స్థానికులు కన్నీరుమున్నీరుగా డిమాండ్ చేస్తున్నారు.