Mahaa Daily Exclusive

  అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి..

Share

*అబద్ధాల పునాదులపైనే సీఎం పీఠం.
**కాంగ్రెస్ మాయమాటలకు మహిళలు బలి.
* తులం బంగారం, స్కూటీ ఏమాయె?
*మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి ద్రోహం.
*నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న శాపం ఆయనకున్నట్లుంది.
*దొంగ హామీల అమలులో కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ సర్కారు.
• రేవంత్‌పై బండి సంజయ్ ఫైర్.
హైదరాబాద్, మహా.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అబద్ధాల పునాదులపైనే ఆ పదవిని అధిష్టించారని, ఆయనొక ‘అభినవ గోబెల్స్’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి తెలంగాణ మహిళలను కాంగ్రెస్ పార్టీ నిలువునా వంచించిందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన పదునైన వ్యాఖ్యలతో కూడిన ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, ఇండీ కూటమి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఉతికి ఆరేశారు.
అబద్ధాలు, మోసాలు చేసే వారినే సమాజంలో ప్రజలు నమ్ముతారని బహిరంగంగా ప్రకటించిన నాయకుడు రేవంత్ రెడ్డి అని, అదే అబద్ధాలతో ఆయన పబ్బం గడుపుకుంటున్నారని బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల చెవిలో పూలు పెట్టిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రతినెలా రూ. 2500 ఇస్తామని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, యువతులకు ఉచితంగా స్కూటీ ఇస్తామని ఆశచూపి.. నేడు ఆ హామీలన్నింటికీ నిర్దాక్షిణ్యంగా తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న శాపం ఏమైనా రేవంత్ రెడ్డికి ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే దొంగ హామీలతో, పచ్చి అబద్ధాలతో పాలన సాగిస్తూ, నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ముఖ్యమంత్రికి పరిపాటిగా మారిందని ఆయన దుయ్యబట్టారు.
దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుల విషయంలో రేవంత్ రెడ్డి, ఇండీ కూటమి నేతలు అనుసరించిన తీరును బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో బిల్లు తెస్తే.. దానిని విపక్షాలు అడ్డుకున్నాయని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాస్తవాన్ని ముందే పసిగట్టిన కేంద్రం, ప్రతి రాష్ట్రానికీ సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా రాజ్యాంగ సవరణ బిల్లు తెస్తే కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలతో అడ్డుపడ్డారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, ఎంకే స్టాలిన్ వంటి నేతలు అపోహలు సృష్టించి దక్షిణాదికి ఉన్న అద్భుతమైన అవకాశాలకు గండికొట్టి, చారిత్రక ద్రోహం చేశారని ఆరోపించారు.
మహిళా బిల్లును అడ్డుకుని, అడ్డుకోవడంలో తామేదో ఘనకార్యం సాధించినట్లు ఇండీ కూటమి నేతలు సంబరాలు చేసుకోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ మహిళలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల మంది మహిళలు కాంగ్రెస్ చేసిన ఈ ఘోర అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోరని హెచ్చరించారు. కుటిల రాజకీయాలతో మహిళల కలలను కల్లలు చేసిన రేవంత్ సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, మహిళలంతా ఏకమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ మోసాలను, అబద్ధాలను రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ తీసుకువెళ్లి వారి బండారం బయటపెట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సమరశంఖం పూరించేందుకు సన్నద్ధమవుతున్నాయని బండి సంజయ్ తన ప్రకటనలో వెల్లడించారు.