Mahaa Daily Exclusive

  సీబీఐకి అడ్డంగా దొరికిన ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్…

Share

*ఏలూరులో అవినీతి బాగోతం.
* రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ముగ్గురు బ్యాంక్ అధికారులు.
*రూ. 50 లక్షల సీసీ లిమిట్ రద్దు చేస్తామని బెదిరింపులు.
*ఆడిటర్ పేరు చెప్పి దందాలకు తెరలేపిన సిబ్బంది.
* విజయవాడ కోర్టుకు నిందితులు.

విజయవాడ, మహా.

ఏలూరు జిల్లా కేంద్రంలోని నరసింహారావు పేటలో ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో భారీ అవినీతి బాగోతం వెలుగుచూసింది. కస్టమర్ల అకౌంట్లలో సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ వారిని భయపెట్టి లంచాలు డిమాండ్ చేస్తున్న ముగ్గురు బ్యాంకు అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏప్రిల్ 18, 2026న ఒక ఫిర్యాదుదారుడి నుంచి రూ. 25,000 లంచం తీసుకుంటుండగా బ్రాంచ్ చీఫ్ మేనేజర్, క్లర్క్-కమ్-క్యాషియర్, అలాగే గోల్డ్ అప్రైజర్‌లను సీబీఐ అధికారులు పక్కా వ్యూహంతో వలపన్ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీబీఐ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరులో ఆటో ఏజెన్సీ నడుపుతున్న ఒక వ్యాపారి తన దైనందిన వ్యాపార లావాదేవీల నిమిత్తం ఇండియన్ బ్యాంక్ నరసింహారావు పేట బ్రాంచ్ నుంచి రూ. 50 లక్షల ఓపెన్ క్యాష్ క్రెడిట్ (OCC) లిమిట్ మంజూరు చేయించుకున్నారు. అయితే, సదరు వ్యాపారి వ్యక్తిగత పని మీద మార్చి 30, 2026 నుంచి ఏప్రిల్ 17 వరకు రాజస్థాన్ వెళ్లారు. సరిగ్గా ఇదే అదనుగా భావించిన బ్రాంచ్ చీఫ్ మేనేజర్, క్లర్క్ ఆయనకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. బ్యాంకు ఆడిటర్ తనిఖీలకు వచ్చారని, మీ అకౌంట్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని సాకులు చెప్పారు. మీ అకౌంట్ లిమిట్‌ను రూ. 50 లక్షల నుంచి రూ. 20 లక్షలకు తగ్గిస్తామని, లేదా అకౌంట్‌ను ఎన్‌పీఏ (NPA – నిరర్థక ఆస్తి) గా ప్రకటిస్తామని తీవ్రంగా భయపెట్టారు. అకౌంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలంటే లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ. 50 వేలు లంచం ఇచ్చుకోవాలని చీఫ్ మేనేజర్ డిమాండ్ చేశాడు. చివరికి బేరసారాల తర్వాత ఆ మొత్తాన్ని రూ. 30 వేలకు కుదుర్చుకున్నారు.
బ్యాంకు ఆడిటర్ మీ అకౌంట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు తాము ఇప్పటికే ఆయనకు లంచం కింద కొంత మొత్తం ఇచ్చేశామని బుకాయిస్తూ.. ఫిర్యాదుదారుడి నుంచి రూ. 25 వేలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 18న కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు పక్కా ప్లాన్‌తో ట్రాప్ చేశారు. సదరు వ్యాపారి నుంచి ఆ రూ. 25 వేల లంచం నగదును తీసుకుంటుండగా చీఫ్ మేనేజర్, క్లర్క్-కమ్-క్యాషియర్ మరియు గోల్డ్ అప్రైజర్‌లను అడ్డంగా పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన ఈ ముగ్గురు నిందితులను విజయవాడలోని కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సీబీఐ వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని, అధికారుల ఇళ్లు, తదితర ప్రాంతాల్లో సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తమ ప్రకటనలో స్పష్టం చేసింది. సామాన్యులకు అండగా నిలవాల్సిన బ్యాంకు అధికారులే ఇలా అక్రమాలకు పాల్పడటం ఏలూరులో తీవ్ర కలకలం రేపుతోంది.