మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టం..
*మాఫియా ఆటలు ఇక సాగవు.
* 29లోగా పోలీసుల ముందు లొంగిపోవాల్సిందే.
*టీఎంసీ జంగల్ రాజ్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం.
* తృణమూల్ సిండికేట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల తూటాలు పేల్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ టార్గెట్‌గా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా విహరిస్తున్న మాఫియా, టీఎంసీ సిండికేట్లకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 4వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క అక్రమార్కుడినీ వదిలిపెట్టబోమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బిష్ణుపూర్, పురూలియాలో జరిగిన విజయ సంకల్ప సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. రాష్ట్ర సర్కారు వైఫల్యాలను, అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు.
**మాఫియా లొంగిపోవాల్సిందే.. గిరిజనులకు అన్యాయం**
బిష్ణుపూర్ సభలో ప్రధాని మాట్లాడుతూ.. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇకపై సాగవని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారంతా ఈ నెల 29లోగా తమంతట తాముగా వెళ్లి పోలీస్ స్టేషన్లలో లొంగిపోవాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. అనంతరం పురూలియా సభలో ప్రసంగించిన ఆయన.. మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, అమాయకులైన ఆదివాసీల భూములను టీఎంసీ సిండికేట్లు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ‘కట్-మనీ’ (కమీషన్ల) దందాకు తెరలేపారని, వారి స్వార్థం వల్లే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావడం లేదని, ఉపాధి కొరత ఏర్పడిందని ప్రధాని ధ్వజమెత్తారు.
**సిండికేట్లను కూకటివేళ్లతో పెకిలిస్తాం**
పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ మౌలిక సదుపాయాలన్నీ టీఎంసీ సిండికేట్ గుప్పిట్లోనే బందీ అయ్యాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మండీలు, కోల్డ్ స్టోరేజ్ (శీతల గిడ్డంగులు) సౌకర్యాల నియంత్రణను అధికార పార్టీ తమ సిండికేట్ సభ్యులకు అప్పగించి రైతుల పొట్టగొడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ సిండికేట్ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని ఆయన ప్రజల సాక్షిగా శపథం చేశారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో మమత ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, వేలాది మంది అర్హులైన యువత జీవితాలతో చెలగాటమాడిందని మండిపడ్డారు. గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో బెంగాల్‌లో నిరుద్యోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని, ఈ ‘మహా జంగల్ రాజ్’ వల్లే రాష్ట్రం పెను సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.
**ఈసారి బీజేపీదే భారీ మెజారిటీ!**
ఎన్నికల ఫలితాలపై తనకున్న ధీమాను ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యక్తపరిచారు. “సాధారణంగా నేను ఎన్నికల అంచనాలు వేయను, ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగా చెప్పను. కానీ ఈసారి బెంగాల్‌లో నేను కలిసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బలంగా చెబుతున్నారు” అని ఆయన అన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ అపూర్వ స్పందన చూస్తుంటే, ఈసారి రాష్ట్రంలో బీజేపీ అత్యంత భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్న నమ్మకం తనకు కలిగిందని ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ సుదీర్ఘ పాలనలో రాష్ట్రాభివృద్ధి అడుగంటిపోయిందని, రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని మోదీ విమర్శించారు.







