హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి.అంటే సర్వే సంస్థలకు కూడా అందనంతగా కాంగ్రెస్ పార్టీ తప్పటడుగులు వేసింది. అయితే దీన్ని మర్చిపోవడమే కాకుండా ఆ తప్పుల్ని తిరిగి మహారాష్ట్రలో చేయకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా కూటమి విషయంలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది.
నవంబర్ 20న ఒకే దశలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీలో భాగంగా శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గంతో కలిసి పోటీ చేస్తోంది. దీంతో టికెట్ల కేటాయింపు అంశం చాలా కీలకంగా మారింది. అయితే హర్యానాలో టికెట్ల పంపకాల విషయంలో తప్పటడుగులు వేసిన కాంగ్రెస్ ఈసారి మాత్రం మిత్రపక్షాల విషయంలో జాగ్రత్తగా వ్యపహరిస్తోంది.
తాజాగా మహారాష్ట్ర ఎన్నికల కోసం ఏఐసీసీ 11 మంది సీనియర్ పరిశీలకులతో పాటు ఇద్దరు సీనియర్ సమన్వయకర్తల్ని కూడా నియమించింది. వీరితో జరిగిన భేటీలో వచ్చిన సూచనల మేరకు మిత్రపక్షాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది.
అలాగే దళిత-ముస్లింల ఓట్లు బలంగా ఉన్న రాష్ట్రంలో, లోక్‌సభ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రంలో ఆ పార్టీ ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ అత్యధికంగా 13 సీట్లు గెల్చుుకుంది.
దీంతో ఇప్పుడు వాటి ఆధారంగా మిత్రపక్షాల కంటే ఎక్కువ సీట్లు అడుగుతోంది. అదే సమయంలో వారితో బంధం చెక్కచెదరకుండా చూసుకుంటోంది. అలాగే హర్యానా తరహాలో రెబెల్స్ పోటీలో లేకుండా జాగ్రత్త పడుతోంది.
మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో ఐదు గ్యారంటీలు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో ఓటర్లకు ఇంటింటికి నగదు చెల్లింపులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత 10 కిలోల ధాన్యాలు, చౌకైన విద్యుత్ , నిరుద్యోగ భృతి వంటి కొన్ని వాగ్దానాలు చేయబోతున్నట్లు నేతలు చెప్తున్నారు.అలాగే కుల గణన హామీ కూడా ఉంటుందని చెప్తున్నారు. రెండేళ్ల క్రితం ఇలాంటి గ్యారంటీలతో హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ ఎన్నికల్ని కాంగ్రెస్ గెల్చుకుంది. అలాగే కుల సమీకరణాల విషయంలోనూ హర్యానాలో జాట్లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి మిగిలిన ఓట్లు కోల్పోయిన సీన్ ను రిపీట్ చేయరాదని భావిస్తోంది.








