Mahaa Daily Exclusive

  పారిశ్రామిక దిగ్గజం జీఎన్ నాయుడు కన్నుమూత…

Share

* పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం చంద్రబాబు.
హైదరాబాద్, మహా.
తెలుగు రాష్ట్రాల పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని నాయుడు నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న విషాద ఛాయల మధ్య జీఎన్ నాయుడు కుటుంబ సభ్యులను కలుసుకున్న చంద్రబాబు, వారిని ఓదార్చుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జీఎన్ నాయుడు మరణం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఒక సామాన్య స్థాయి నుంచి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఎదిగిన నాయుడు ప్రస్థానం ఎందరో యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ‘రీజెన్సీ గ్రూప్’ను స్థాపించి, దాని ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, తన వంతుగా సమాజ శ్రేయస్సుకు ఎంతో తోడ్పడ్డారని సీఎం ప్రశంసించారు.
ఈ సందర్బంగా జీఎన్ నాయుడుతో తనకున్న దశాబ్దాల కాలం నాటి అనుబంధాన్ని ముఖ్యమంత్రి నెమరువేసుకున్నారు. క్లిష్ట సమయాల్లోనూ ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయుడి వ్యక్తిత్వం తనకు బాగా తెలుసని, ఆయనతో గడిపిన క్షణాలు, పంచుకున్న ఆలోచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు నేల ఒక గొప్ప విజనరీని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా విచ్చేసి జీఎన్ నాయుడుకు నివాళులర్పించారు. జీఎన్ నాయుడు మృతితో పారిశ్రామిక వర్గాల్లో విషాదం అలుముకుంది.