Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌కు మరో 20 ఏళ్లు అధికారం కల్ల…..

Share

* అవినీతి, అరాచకాలపై గళమెత్తండి.
* పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం
హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న రెండున్నర ఏళ్ల పాలన ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, పైగా అడ్డగోలు అవినీతి, కుంభకోణాలతో రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతోందని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధ్వజమెత్తారు. శనివారం నంది నగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సీనియర్ నాయకులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రెండు దశాబ్దాల పాటు ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కేటీఆర్ జోస్యం చెప్పారు.
సమావేశం ప్రారంభంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి ఓటు వేసిన సబ్బండ వర్గాలను ఆ పార్టీ దారుణంగా వంచించిందని విమర్శించారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కమిషన్ల కక్కుర్తి, కాసుల వేట కనిపిస్తోందని, పాలన అనేది అవినీతికి అడ్డాగా మారిందని మండిపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములు మరియు మైనింగ్ వ్యవహారాల్లో మంత్రులే స్వయంగా కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ నాయకులు ఈ అవినీతిపై క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరచాలని, ప్రతి పౌరుడికీ కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నిన్న ఒక్కరోజే గ్యాస్ సిలిండర్ ధరను వెయ్యి రూపాయలకు పైగా పెంచడం సామాన్యుడి నడ్డి విరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచుకుంటూ పోవడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీనికి బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ధరల పెంపునకు వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్రం పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పార్టీ సంస్థాగత బలోపేతంపై కూడా కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు కమిటీల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని నాయకులకు సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ మరియు బీజేపీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లను నమోదు చేసే అవకాశం ఉందని, అదే సమయంలో అర్హులైన యువతీ యువకుల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే బాధ్యతను పార్టీ కార్యకర్తలు భుజాన వేసుకోవాలని, ప్రజల ఓటు హక్కుకు భరోసాగా నిలవాలని ఆదేశించారు.
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పుడే సమాయత్తం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇటీవలి పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయాలు సాధించినందుకు నాయకులను అభినందించిన ఆయన, అదే జోష్‌ను కొనసాగిస్తూ మున్సిపల్ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.