- పవన్ ను పరామర్శించిన చంద్రబాబు
- గత కొంతకాలంగా పవన్ కు అనారోగ్య సమస్యలు
- ఇటీవలే హైదరాబాద్‌లో శస్త్రచికిత్స
- శస్త్రచికిత్స నేపథ్యంలో తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచన
హైదరాబాద్, మహా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై క్లుప్తంగా చర్చించుకున్నట్లు సమాచారం. తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.







