Mahaa Daily Exclusive

  బతుకమ్మ కుంటలో 10 ఎకరాల చెరువు ఉంది…..

Share

* సర్వే ఆఫ్ ఇండియా రికార్డులే సాక్ష్యం.
*చెరువు భూమికి పట్టాలు రావు.
* హైకోర్టు ఉత్తర్వుల మేరకే హైడ్రా చర్యలు.
*ఆక్రమణల్లో ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.
* ప్రభుత్వానికి హైడ్రా ప్రతిపాదన.
* పెద్దోళ్లను వదిలేస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం!* హైడ్రా కమిషనర్‌ రంగనాథ్.
హైదరాబాద్, మహా.
నగరంలోని చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అంబర్‌పేట్ పరిధిలోని బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణపై ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ కుంటలో అసలు చెరువే లేదని, అది తన సొంత భూమి అని పిటిషనర్ పేర్కొనడాన్ని రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను పరిశీలిస్తే అక్కడ స్పష్టంగా 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నగరంలో వరదల నివారణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు గౌరవ హైకోర్టు తమకు పూర్తి అనుమతులు ఇచ్చిందని, తాము హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను తు.చ తప్పకుండా పాటిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
చెరువు భూమికి ఒక వ్యక్తి యజమానిగా ఎలా చలామణీ అవుతారనే అంశంపై కమిషనర్ విస్మయం వ్యక్తం చేశారు. గతంలో అక్కడ తాము వ్యవసాయం చేశామని, కాబట్టి ఆ భూమి తమదేనని వాదించడం హాస్యాస్పదమన్నారు. చెరువును మట్టితో పూడ్చి వ్యవసాయం చేసినంత మాత్రాన ఆ భూమిపై హక్కులు రావని, అసలు చెరువు శిఖం భూమికి పట్టాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు పద్ధతుల్లో పట్టాలు పొందినా, అవి చెరువు భూమి కిందకే వస్తాయని వివరించారు. కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతున్నారని, ధనికులను వదిలేస్తున్నారనే విమర్శల్లో వాస్తవం లేదని రంగనాథ్ కొట్టిపారేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఆక్రమణ ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.
చెరువులు, కుంటలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న పేదల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోందని రంగనాథ్ వెల్లడించారు. నీటి వనరుల మధ్య నివసించడం వల్ల వర్షాకాలంలో ఆ పేద కుటుంబాల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, అందుకే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అటువంటి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించి, వారికి శాశ్వత నివాసం కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన పట్ల ప్రభుత్వం కూడా అత్యంత సానుకూలంగా ఉందని, ఆక్రమణదారుల్లోని పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నగర భవిష్యత్తు కోసం, వరదల ముప్పు నుంచి ప్రజలను కాపాడటం కోసమే హైడ్రా ఈ చర్యలు చేపడుతోందని, దీనికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.