కాన్వాయ్ కోసం జనాన్ని ఆపొద్దు.
* సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..
* హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.
* త్వరలో రోడ్డు సేఫ్టీ బ్యూరో ప్రారంభం!
* ట్రాఫిక్ పోలీసులకు డీజీపీ దిశానిర్దేశం.
* సీఎం విజన్‌కు అనుగుణంగా కొత్త ట్రాఫిక్ వ్యూహం.
* డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష.
హైదరాబాద్, మహా.
భాగ్యనగరంలో సామాన్య పౌరుల ప్రయాణం సాఫీగా సాగాలని, ముఖ్యంగా వివిఐపిల కదలికల సమయంలో ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ప్రమాదాలు, అలాగే కాన్వాయ్ కదలికల సమయంలో వాహనదారులను సుదీర్ఘకాలం ఆపి ఉంచడంపై ప్రజల నుంచి వెల్లువెత్తిన నిరసనలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ప్రజలకు కనీస అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ అధికారులతో మాట్లాడి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శనివారం తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు కమిషనరేట్ల ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లు, డీసీపీలతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు డైనమిక్ వ్యూహాలను అవలంబించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వివిఐపిల కాన్వాయ్ వెళ్లేటప్పుడు పౌరులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా చూడాలని, నిబంధనల అమలులో సామర్థ్యంతో పాటు మానవీయ కోణాన్ని కూడా విస్మరించవద్దని డీజీపీ స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చూడటంతో పాటు, వేగ నియంత్రణపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం త్వరలోనే ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ బ్యూరో’ను ఏర్పాటు చేయబోతున్నట్లు డీజీపీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ బ్యూరో ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉందని, ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఈ విభాగం ద్వారా రోడ్డు భద్రతా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రమాదాల అన్వేషణ, నివారణ చర్యలపై శాస్త్రీయ అధ్యయనం చేయనున్నట్లు వివరించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లను మరింత ఉధృతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఫ్యూచర్ సిటీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) చందన దీప్తితో పాటు ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, కాజల్ సింగ్, రాహుల్ రెడ్డి, అవినాష్ కుమార్, శేషాద్రిణి రెడ్డి, శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వివిధ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని డీజీపీ కోరారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ప్రజలకు చికాకు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.








