- మొక్కై నాటితే.. రాశులై పండింది
- హరితహారం’ ఫలాల వెనుక ఒక సామాన్యుడి విజయం
కారేపల్లి, మహా:
ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, వాటిని ప్రజలు బాధ్యతగా స్వీకరించినప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయో చెప్పడానికి కారేపల్లి మండలం రామలింగాపురం(కారేపల్లి క్రాస్ రోడ్)లోని ఈ ఘటనే నిదర్శనం.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ హరితహారం’ఋ కేవలం అడవుల పెంపకానికే పరిమితం కాలేదు,అనేక కుటుంబాల పెరటి సంపదగా కూడా మారింది.
నాడు ఒక చిన్న మొక్క..
నేడు ఆ రాశే ఒక లెక్క!
కొన్నేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ఇంటి ముందు నాటిన ఒక చిన్న కొబ్బరి మొక్క,నేడు ఆ ఇంటికి కల్పవృక్షమై నిలిచింది.ఆ ఇంటి యజమాని చూపిన శ్రద్ధ,నిత్యం అందించిన సంరక్షణతో ఆ మొక్క నేడు గగనమంత ఎత్తుకు ఎదిగి, పచ్చని కొబ్బరి బోండాల రాశులను కురిపిస్తోంది.చేతికి అందిన దిగుబడిని చూసి ఆ ఇంటి సభ్యుల ఆనందానికి అవధులు లేవు.
ఒక్క మొక్క.
ఈ‘హరిత’విజయం కేవలం కొబ్బరికాయలకే పరిమితం కాలేదు.తాజా కొబ్బరికాయలు ఇంటి అవసరాలు తీర్చడమే కాకుండా,ఒక చిన్నపాటి ఆదాయ వనరుగా మారాయి. అదే చెట్టు నుండి వచ్చిన ఎండిన ఆకులతో నేడు ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఇళ్లవారు స్వయంగా కొబ్బరి చీపుర్లను తయారు చేసుకుంటున్నారు. అంతేకాదు కాయల నుండి ఒలిచిన కొబ్బరి పీచును ఎండబెట్టి శీతాకాలంలో స్నానానికి కట్టెల పొయ్యి ద్వారా నీళ్లు వేడి చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు‘వ్యర్థం’ అనుకున్న ప్రతిదీ ఇక్కడ ‘అర్థం’(ఆదాయం)గా మారుతోంది.
చాలా చోట్ల నాటిన మొక్కలు సంరక్షణ లేక ఎండిపోతున్న తరుణంల,కారేపల్లి మండలం క్రాస్ రోడ్ లోని ఈ ఉదంతం పర్యావరణ ప్రేమికులకు ఒక పాఠం.ఒక మొక్కను నాటడం అంటే కేవలం గుంత తీయడం కాదు,ఆ మొక్కతో పాటు ఒక ప్రాణాన్ని పెంచడం అని ఈ కుటుంబం నిరూపించింది. హరితహారం లక్ష్యం కేవలం పచ్చదనం కాదు,అది సామాన్యుడికి అందించే ఒక దీర్ఘకాలిక ఆస్తి అని ఈ కొబ్బరి చెట్టు చాటి చెబుతోంది.
నేడు పచ్చని ఆకులతో, నిండుగా ఉన్న కాయలతో కళకళలాడుతున్న ఆ ఇంటి ముందర దృశ్యం,చూసే బాటసారులకు కూడా “మనం కూడా మొక్కలు నాటాలి” అనే స్పూర్తిని కలిగిస్తోంది.ప్రభుత్వ సంకల్పానికి,సామాన్యుడి శ్రమ తోడైతే ఫలితాలు ఇలాగే ఆకాశమంత ఎత్తులో ఉంటాయని చెప్పక తప్పదు.








