Mahaa Daily Exclusive

  కొనుగోలు కేంద్రాల్లో కన్నీటి సెగ…

Share

* ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇద్దరు రైతులు బలి.
మహబూబాబాద్/ఇబ్రహీంపట్నం,మహా.
పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతన్నలకు నిరీక్షణే శాపమైంది. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఇద్దరు కర్షకులు కన్నుమూశారు. ఆకాశం నుంచి కురిసిన వర్షం ఒకరి ప్రాణం తీస్తే, అధికారుల కొర్రీలతో వచ్చిన ఆవేదన మరొకరి గుండెను ఆపేసింది. ఈ ఘటనలు తెలంగాణా రైతాంగంలో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపాయి.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామంలో గుండెలు పిండే విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న(45) అనే రైతు తన పంటను విక్రయించేందుకు స్థానిక ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేపట్టకపోవడంతో ఆయన అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో, తడిసిపోతున్న తన పసిడి లాంటి పంటను కాపాడుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. అదే సమయంలో పిడుగు పడటంతో వెంకన్న అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుడు మూగ, చెవిటి దివ్యాంగుడు కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. సకాలంలో ప్రభుత్వం పంటను సేకరించి ఉంటే, తన బిడ్డ తమ కళ్లముందే ఉండేవాడని ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాయపోల్ ఐకేపీ కేంద్రంలో మరో రైతు బలి అయ్యారు. రాపోలు గౌరయ్య అనే రైతు తను పండించిన వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే తేమ శాతం (మాయిశ్చర్) ఎక్కువగా ఉందనే సాకుతో అధికారులు పంటను కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక గత నాలుగు రోజులుగా ఎండలో వడ్లను ఆరబోస్తూ, అధికారుల చుట్టూ తిరుగుతూ ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. శనివారం పంట వద్దే ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
ఈ రెండు ఘటనలపై రైతాంగం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ మరణాలు సంభవించాయని, అన్నం పెట్టే రైతు అమ్ముకునే దారి లేక ప్రాణాలు వదలడం ఈ వ్యవస్థకే సిగ్గుచేటని అన్నదాతలు మండిపడుతున్నారు. తక్షణమే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.