విద్యుత్ వాహన విపణిలో నయా ట్రెండ్.
* టీవీఎస్, బజాజ్ దూకుడు.. వెనుకబడ్డ ఓలా.
ఢిల్లీ, మహా
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. గతంలో ఏకఛత్రాధిపత్యం వహించిన అంకుర సంస్థలను కాదని, దశాబ్దాల అనుభవం ఉన్న దిగ్గజ సంస్థలు ఇప్పుడు విద్యుత్ విపణిలో తమ సత్తా చాటుతున్నాయి. ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే విపణిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హోరాహోరీ పోరులో టీవీఎస్ మోటార్ కంపెనీ రికార్డు స్థాయి అమ్మకాలతో అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 37,661 వాహన విక్రయాలతో టీవీఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, బజాజ్ చేతక్ 32,883 యూనిట్లతో గట్టి పోటీనిస్తూ రెండో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు మార్కెట్ లీడర్‌గా వెలుగొందిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు ఈసారి గణనీయంగా తగ్గి కేవలం 12,166 వాహనాలకే పరిమితమవ్వడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మరోవైపు అంకుర సంస్థల్లో ఏథర్ ఎనర్జీ తన పట్టును నిలబెట్టుకుంటూ 27,024 వాహనాలతో మూడో స్థానంలో నిలిచింది. హీరో మోటోకార్ప్ కు చెందిన విడా బ్రాండ్ సైతం క్రమంగా పుంజుకుంటూ 15,230 అమ్మకాలను నమోదు చేసింది. మధ్య శ్రేణి విభాగంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్, రివర్ మోబిలిటీ, బిగాస్ వంటి సంస్థలు తమ ఉనికిని చాటుకుంటుండగా, సింపుల్ ఎనర్జీ మరియు బౌన్స్ ఎలక్ట్రిక్ వెయ్యికి పైగా యూనిట్లతో నిలకడగా సాగుతున్నాయి.
ఇక జపాన్ దిగ్గజ సంస్థలు సైతం భారత విద్యుత్ మార్కెట్‌పై కన్నేశాయి. ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశించిన హోండా ఆక్టివా ఈ (Activa e) 377 వాహనాలతో తన ఖాతాను తెరువగా, యామహా 103 వాహనాలతో పయనాన్ని ప్రారంభించింది. ప్రీమియం విభాగంలో అల్ట్రావైలెట్, మేటర్ వంటి సంస్థలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. వినియోగదారులు బ్రాండ్ విశ్వసనీయతకు, మెరుగైన సేవా సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతోనే టీవీఎస్, బజాజ్ వంటి పాత తరం సంస్థలు ఇప్పుడు విద్యుత్ వాహన రంగంలోనూ అగ్రగామిగా ఎదుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలు పెరుగుతున్న కొద్దీ రానున్న నెలల్లో ఈ పోటీ మరింత తీవ్రం కానుంది.






