Mahaa Daily Exclusive

  పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా విమానం గల్లంతు.

Share

పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా విమానం గల్లంతు.
* ‘స్ట్రాటో ట్యాంకర్’ మిస్సింగ్!
* హార్ముజ్ జలసంధి వద్ద హైటెన్షన్.
* 7700 ఎమర్జెన్సీ కోడ్ ఇచ్చి అదృశ్యమైన విమానం.
* గాల్లోనే అదృశ్యమైన ‘ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్’.
* నిశ్శబ్దమైన రాడార్ సంకేతాలు.

హైదరాబాద్, మహా.

పర్షియన్ గల్ఫ్ మరియు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా వాయుసేనకు చెందిన బోయింగ్ కెసి-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం గల్లంతవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన ఈ విమానం, ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా రాడార్ నుంచి అదృశ్యమైంది. విమానం అదృశ్యం కావడానికి కొద్ది నిమిషాల ముందు పైలట్లు 7700′ అనే అంతర్జాతీయ అత్యవసర సంకేతాన్ని జారీ చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సాధారణంగా విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తినా లేదా మరేదైనా ప్రాణాపాయ స్థితి ఎదురైనా పైలట్లు ఈ సంకేతాన్ని ఉపయోగిస్తారు.

**ఫ్లైట్ రాడార్ డేటా ఏం చెబుతోంది?**

ఫ్లైట్ రాడార్-24 డేటా ప్రకారం, విమానం ఖతార్ గగనతలంలో ఉండగా దాని ట్రాన్స్‌పాండర్ సంకేతాలు నిలిచిపోయాయి. సంకేతాలు ఆగిపోవడానికి ముందు విమానం గాలిలో వృత్తాకారంలో తిరుగుతూ ఎత్తును తగ్గించుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇది అత్యవసర ల్యాండింగ్ కోసం చేసిన ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ వైపు విమానం వెళ్లే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, అది సురక్షితంగా ల్యాండ్ అయిందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

**ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ , జీపీఎస్ జామింగ్ సందేహాలు**

ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి పరిసరాల్లో భారీ ఎత్తున జీపీఎస్ జామింగ్ , స్పూఫింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ఆపరేషన్ రెండో రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం. ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రం కారణంగా విమానంలోని దిక్సూచి వ్యవస్థలు దెబ్బతిని గమ్యం తప్పిందా? లేక మరేదైనా బాహ్య దాడి జరిగిందా? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

**కీలకమైన ‘ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్’ ప్రాధాన్యత**

అమెరికా సైనిక వ్యూహాల్లో కేసి-135 స్ట్రాటో ట్యాంకర్ అత్యంత కీలకమైనది. దీనిని ‘ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్’ అని పిలుస్తారు. యుద్ధ విమానాలు, బాంబర్లు గాలిలో ఉన్నప్పుడే వాటికి ఇంధనం నింపడం దీని ప్రధాన విధి. ఈ విమానం అందుబాటులో లేకపోతే ఇతర ఫైటర్ జెట్ల ఆపరేషన్ సమయం భారీగా తగ్గిపోతుంది. దాదాపు 60 ఏళ్లుగా అమెరికా వాయుసేనలో సేవలందిస్తున్న ఈ విమానం గల్లంతవ్వడం అమెరికా రక్షణ శాఖకు పెద్ద దెబ్బగానే భావించవచ్చు.

**మౌనంగా ఉన్న పెంటగాన్.. ఆందోళనలో రక్షణ వర్గాలు**

ఈ మిస్సింగ్ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ గానీ, పెంటగాన్ గానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఖతార్ నుంచి హెలికాప్టర్లు గాలింపు చర్యల కోసం బయల్దేరినట్లు సమాచారం ఉన్నప్పటికీ, విమాన శకలాలు దొరికినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మార్చి నెలలో ఇరాక్ సరిహద్దుల్లో ఒక కేసి-135 విమానం దాడికి గురైన ఘటన నేపథ్యంలో, తాజా మిస్సింగ్ వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉందా అన్న భయాందోళనలు నెలకొన్నాయి.