కొత్తగూడెం అటవీ భూముల వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
* రెవెన్యూ రికార్డులుంటే హక్కులున్నట్లు కాదు.
* కాల్వలనాగరం కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ.
*600 ఎకరాలు అటవీ భూమిగానే కొనసాగుతుందన్న ధర్మాసనం.
* నిజాం కాలం నాటి నోటిఫికేషనే ఫైనల్.
* అప్పీలుదారులకు సుప్రీంలో చుక్కెదురు.
హైదరాబాద్, మహా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దశాబ్దాలుగా నలుగుతున్న ఓ భారీ భూవివాదానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం శాశ్వత ముగింపు పలికింది. కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలం కాల్వలనాగరంలో ఉన్న సుమారు 600 ఎకరాల భూమి తమదేనంటూ కొందరు వ్యక్తులు సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ భూములను అటవీ శాఖ రక్షిత ప్రాంతంగా పరిగణిస్తుండగా, పిటిషనర్లు మాత్రం తమకు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఉన్నాయని వాదిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కింది కోర్టుల నుంచి హైకోర్టు వరకు పలుమార్లు విచారణలు జరిగాయి. గతంలో రాష్ట్ర హైకోర్టు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఈ భూములను అటవీ భూములుగానే నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అప్పీలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ ఎస్.వీ.ఎన్. భట్టి ధర్మాసనం ఈ అప్పీలును తోసిపుచ్చుతూ తుది తీర్పు వెలువరించింది.
**రెవెన్యూ రికార్డులు హక్కుల పత్రాలు కావు**
విచారణ సందర్భంగా ధర్మాసనం రెవెన్యూ రికార్డుల ప్రామాణికతపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆస్తిపై యాజమాన్యం లేదా టైటిల్ ను నిర్ధారించడానికి రెవెన్యూ రికార్డులు ఏమాత్రం ప్రాతిపదిక కాజాలవని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి పన్నులు లేదా శిస్తు వసూలు చేసే ఉద్దేశ్యంతో మాత్రమే రెవెన్యూ యంత్రాంగం ఆ రికార్డులను నిర్వహిస్తుందని, అవి వ్యక్తులకు భూమిపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను కల్పించవని కుండబద్దలు కొట్టింది. తమ క్లెయిమ్ కు సంబంధించి అప్పీలుదారులు ఎలాంటి అసలైన, చట్టబద్ధమైన టైటిల్ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించడంలో విఫలమయ్యారని ధర్మాసనం తప్పుబట్టింది. పత్రాలు లేకుండా కేవలం రెవెన్యూ రికార్డుల ఆధారంగా హక్కులు కోరడం సరికాదని వ్యాఖ్యానించింది.
**నిజాం ఫారెస్ట్ నోటిఫికేషన్ కు సమర్థన**
ఈ భూములకు సంబంధించి 1950లో అప్పటి నిజాం ప్రభుత్వం జారీ చేసిన ఫారెస్ట్ నోటిఫికేషన్ ను అప్పీలుదారులు సవాలు చేశారు. అయితే వారి వాదనలను కోర్టు తోసిపుచ్చింది. నిజాం కాలం నాటి నోటిఫికేషన్ ఆధారంగా ఆ 600 ఎకరాలు రక్షిత అటవీ ప్రాంతమేనని కోర్టు ధృవీకరించింది. ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి న్యాయపరమైన లోపాలు లేవని, ఆ తీర్పును యథాతథంగా సమర్థిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పుతో ఆ 600 ఎకరాలు ఇకపై అటవీ భూములుగానే కొనసాగుతాయని స్పష్టమైంది. అటవీ సంపద ఆక్రమణలకు చెక్ పెట్టే దిశగా సుప్రీంకోర్టు తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.








