Mahaa Daily Exclusive

  ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి కళ్లెం వేయండి…

Share

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి కళ్లెం వేయండి.
* విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతే.
* ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండటం రాష్ట్రానికే దౌర్భాగ్యం.
* తిరుపతిరావు కమిషన్ నివేదిక ఏమైంది?.
* ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి.
* టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని తక్షణమే అరికట్టాలని, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ‘నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.. విద్య ద్వారా మాత్రమే సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ సాధ్యమవుతాయని, అలాంటి విద్యను ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆమె ఉద్ఘాటించారు. కార్పొరేట్ స్కూళ్లు 50 నుంచి 120 శాతం వరకు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టడం రాష్ట్రానికి దౌర్భాగ్యకరమైన పరిస్థితిగా ఆమె అభివర్ణించారు. పిల్లల చదువుల బాధ్యత కేవలం తల్లిదండ్రులపైనే వదిలేయకుండా, ప్రభుత్వం ఇందులో క్రియాశీలక పాత్ర పోషించి తీరాలని డిమాండ్ చేశారు.
గత, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలపై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫీజుల నియంత్రణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతిరావు కమిషన్ ను ఏర్పాటు చేసిందని, ఆ కమిషన్ అధ్యయనం చేసి స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆమె మండిపడ్డారు. గురుకులాలు ఏర్పాటు చేశామని చెబుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని చూసీచూడనట్లు వదిలేస్తామంటే కుదరదని ప్రస్తుత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పొరుగున ఉన్న తమిళనాడు తరహాలో ఫీజుల నియంత్రణ కోసం ఇక్కడ కూడా ఒక పర్మినెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని లేదా గుజరాత్ మోడల్ లో ప్రాథమిక విద్యకు రూ.15 వేలు, ఉన్నత విద్యకు రూ.25 వేల గరిష్ట పరిమితిని విధించాలని ప్రభుత్వానికి ఆమె ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 65 నుంచి 75 శాతం మంది ప్రైవేటు బడుల్లోనే చదువుతున్నారని కవిత గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలన్నారు. గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూళ్ల ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి స్వయంగా హాజరుకావడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని, ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలా విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో నడుస్తున్నాయని, వీటి వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండటంపై సమాజం ఒకసారి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే మే నెలలోనే ఫీజుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో పిల్లల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.